హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా రాష్ర్టానికి కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదు. పీఎం కుసుమ్ పథకంలో గిరిజన రైతులకు నిరంతరం సాగునీరు అందేలా లక్ష సౌర పంపులు, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు పరిశ్రమ, కొత్త రైల్వేలైన్లు, జాతీయ రహదారులు వంటి డిమాండ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా అన్యాయమే చేసింది. నాడు ‘సారు, కారు, పదహారు’ ఉన్నప్పుడు కేంద్రం నుంచి రూ.వేల కోట్ల నిధులు సాధించారని, కానీ, ఇప్పుడు కేంద్రంలోని అధికార పార్టీ నుంచి 8 మంది, రాష్ట్రంలోని అధికార పార్టీ నుంచి 8 మంది చొప్పున ఎంపీలున్నా 2026-27 కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు సాధించడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానూపోను చేసిన ప్రయాణాలే 62 సార్లు దాటింది కానీ, అర్ధ రూపాయి అదనపు ఆదాయం కూడా అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చే నిధులు తప్ప, ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు తీసుకురాలేకపోయారనే విమర్శలొస్తున్నాయి.
కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాలు, ఆశలు పెట్టుకున్నది. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు కలిపి రూ.1.63 లక్షల కోట్ల నిధులు అవసరమని రాష్ట్రం కేంద్రానికి నివేదికలు పంపింది. రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైలు, మూసీ అభివృద్ధి, హైదరాబాద్, వరంగల్ డ్రైనేజీ వ్యవస్థకు నిధులు అవసరమని అధికారులు బడ్జెట్‌కు ఐదు నెలల ముందుగానే నివేదికలు సిద్ధం చేసి పెట్టారు.
కానీ, రాష్ట్రం నుంచి సమర్థంగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి బడ్జెట్ కేటాయింపులకు ఒప్పించే ప్రయత్నం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం కేంద్ర మంత్రులను కలిసి నిధులు అడిగినం, కేంద్రం సానుకూలంగా స్పందించింద’ని సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ సీఎంవో నుంచి మీడియా నోట్ పంపడమే తప్ప, గత రెండేండ్ల నుంచి కేంద్ర బడ్జెట్లో ఒరిగింది ఏమీలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏం తప్పు చేసిందని రాష్ర్టాన్ని బడ్జెట్లో విస్మరించారని ప్రశ్నించారు. బేగంపేట ప్రజాభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు ఫార్మాహబ్‌ను కేటాయించపోవడం శోచనీయమని అన్నారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగానికి రూ.40 వేల కోట్లు కేటాయించగా.. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వలేదని తెలిపారు. రీజినల్ మెడికల్ వాల్యూ హబ్‌లను ఇతర రాష్ట్రాలకిచ్చి తెలంగాణకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
కేంద్ర బడ్జెట్ రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. బడ్జెట్ ప్రసంగంలో కనీసం తెలంగాణ పదాన్ని ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇది తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక అణచివేతకు నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ర్టానికి సంబంధించి విభజన హామీలకు ఎలాంటి కేటాయింపులు చేయకుండా కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. కేంద్రం వివక్షపై రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధు లు రాబట్టడంలో రాష్ర్టానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో చేనేత పరిశ్రమకు కేంద్రంలోని బీజేపీ సర్కారు మొండిచేయి చూపిందని తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు వనం శాంతికుమార్ విమర్శించారు.