Kishan Reddy | తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీకి సంబంధించి వచ్చిన లీకులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను బయటపెట్టడం మంచిది కాదని అన్నారు. మీటింగ్ వివరాలు ఎవరైనా లీక్ చేస్తారా అని మండిపడ్డారు. భేటీ అంశాలను బయటకు చెప్పొద్దని ప్రధాని చెప్పినా.. లీక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీక్ చేసినోడు మెంటలోడు అని ధ్వజమెత్తారు. లీక్ చేసింది ఎవరో తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెచ్చరించారు. అంతర్గత విషయాలను బయటకు చెప్పడం పార్టీ ఐకమత్యానికి విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీతో జరిగిన సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినట్లే తెలంగాణ ఎంపీలను కూడా పిలిచారని తెలిపారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రధాని మోదీ సూచించారని తెలిపారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని చెప్పినట్లుగా పేర్కొన్నారు. కాగా, గతవారం తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిగిన భేటీలో ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా లేరని.. మీకంటే అసదుద్దీన్ ఓవైసీ నయమంటూ మండిపడ్డారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించిన కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు.
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపైనా కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఓటు చోరీ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అనైతికమని అన్నారు. ప్రధాని స్థాయిని తగ్గించే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. లోక్సభలోలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ ఉండటం దేశానికి దురదృష్టకరమని విమర్శించారు.