హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. జాతీయ రహదారుల కోసం వెంటనే భూసేకరణను పూర్తిచేయాలని విజ్ఞప్తిచేశారు. 2,500 కిలోమీటర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. వీటి కోసం 1,550 హె క్టార్ల భూమి అవసరమున్నదని, కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రప్రభుత్వానికి చాలాసార్లు లేఖలు రాశారని, కానీ ప్ర భుత్వం 904 హెక్టార్ల భూమి మాత్రమే స్వాధీనం చేసిందని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలోనే వేగంగా
రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరిగిందనే విషయం కిషన్‌రెడ్డి లేఖ ద్వారా స్పష్టమైంది. 2014 వరకు 2,500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మిస్తే, 2014 నుంచి పదేండ్లలో 2,500 కిలోమీర్ల మేర నేషనల్ హైవేలు నిర్మించారని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. కానీ ఇటీవల మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఒక్క జాతీయ రహదారి కూడా నిర్మించలేదని ఆరోపించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు తప్పు అనే విషయం ఈ లేఖతో రుజువైందని చర్చ జరుగుతున్నది.