హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : రాహుల్‌గాంధీకో, రేవంత్‌రెడ్డికో భయపడి తాము కులగణన నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కులగణనపై నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతిపక్షాలు రాజకీయ నాటకాలకు తెర లేపాయని ఆరోపించారు. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్, ఎస్టీ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థులుగా ప్రకటించినప్పుడు వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను బరిలోకి దింపిందని ఆయన గుర్తుచేశారు.
వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన ప్రధాని మోదీని కులం పేరుతో దూషించిన చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు. కులగణన నిర్ణయం తమ విజయంగా కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటుందని, మరి 60 ఏండ్లు పాలించిన ఆ పార్టీ కులగణన ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు.