Kishan Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని బంగారు బాతులా వాడుకుంటూ నాశనం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. ‘‘సింగరేణిని బంగారు బాతులా కాంగ్రెస్ వాడుకుంటోంది. తెలంగాణ విద్యుత్ సంస్థలకు బొగ్గును అందించాలని కేంద్రం నైనీ కోల్ బ్లాక్ ను తెలంగాణకు కేటాయించింది. కోల్ బ్లాక్ కు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చింది. నైనీ బొగ్గు గనుల విషయంలో ఒడిశా సీఎంతో మాట్లాడా. చివరి అనుమతులు సింగరేణికి వచ్చేలా చూశా.
అనుమతులు వచ్చినా టెండర్లు పూర్తి చేయలేదు. టెండర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నాన్చుతోంది. టెండర్లు రద్దు చేయడం సింగరేణికి అన్యాయం చేయడమే. అనేక బొగ్గు గనుల్లో సైట్ విజిట్ అనే నిబంధన ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సింగరేణిపై ఒత్తిడి తీసుకొచ్చి సైట్ విజిట్ కు సింగరేణి సర్టిఫికెట్ ఇవ్వాలనే నిబంధన పెట్టారు. సైట్ విజిట్ అనేది సెల్ఫ్ సర్టిఫికేషన్ నిబంధన. కానీ, సింగరేణి ఇవ్వాలనే నిబంధన పెట్టడం ఏంటి..? అంటే వారికి నచ్చిన వారికి నైనీ బ్లాక్ ఇవ్వాలని చూస్తున్నారు. కోల్ బ్లాక్స్ ను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అనేక కోల్ బ్లాక్స్ ను కేంద్రం వేలం పెట్టింది. కానీ, ఎక్కడా, ఎలాంటి ఆరోపణలు రాలేదు. అవినీతి, అక్రమాలకు కేంద్రంగా సింగరేణి మారింది.
కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నా.. పెత్తనం రాష్ట్ర ప్రభుత్వానిదే. సీఎండీ సహా ఏడుగురు డైరెక్టర్లు తెలంగాణ వారే. కేంద్రం తరఫున ముగ్గురు మాత్రమే ఉన్నారు. సింగరేణిని కాంగ్రెస్ నాశనం చేస్తోంది. సింగరేణి రాజకీయ ప్రయోగశాలగా మారింది. సింగరేణి కార్మికుల రక్తం, చెమట దోచుకుంటున్నారు. బొగ్గు గనుల విషయంలో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఉండాలి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తే విచారణకు కేంద్రం సిద్ధంగా ఉంది. బొగ్గు గనుల వివాదంలోకి నన్ను లాగాలని చూస్తున్నారు’’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.