Kishan Reddy | హైదరాబాద్ : ప్రజలకు మేలు చేసేలా, హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. బేగంపేట్ హోటల్ హరిత ప్లాజాలో (DISHA) అభివృద్ధి కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. దిశ కమిటీ చైర్మన్ హోదాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం సుధీర్ఘంగా నాలుగు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో హెచ్ఎండీఏ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, దిశ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాదిరిగానే శనివారం జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ కమిటీ) సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, విద్యుత్ సంబంధిత సమస్యల గురించి చర్చించడం జరిగింది. దిశా కమిటీ చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతో పాటు ప్రజా సమస్యలు, కీలకాంశాలపై చర్చించానని తెలిపారు.
హైదరాబాద్ నుంచి తెలంగాణకు 80 శాతం రెవెన్యూ వస్తోంది. ప్రతిరోజు సుమారు 10 లక్షల మంది హైదరాబాద్‌కు రాకపోకలు జరుపుతుంటారు. హైదరాబాద్ నగర ప్రజల కోసం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. కార్మికులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం డ్రైనేజీ సమస్యలతో పాటు డ్రింకింగ్ వాటర్ సదుపాయం కల్పించాలి. హైదరాబాద్‌లోని అంగన్వాడీలు, పాఠశాలలు, హాస్టల్స్ కిరాయి బిల్డింగుల్లో కొనసాగుతున్నాయి. పేదపిల్లలు చదువు కోసం సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం లేదు. కేంద్ర ప్రభుత్వం 29 మైనారిటీలకు సంబంధించి స్కూళ్లకు నిధులు విడుదల చేసింది. మైనారిటీ, మెజారిటీ అనే తేడా లేకుండా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోంది. రాజీకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని కిషన్ రెడ్డి తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో కేంద్ర ప్రభుత్వం రూ. 715 కోట్లతో అభివృద్ధి చేస్తోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణలో సహకారం అందించడం లేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పార్కింగ్తో పాటు ప్రయాణికులకు సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ మూడు టర్మినల్స్‌కు అదనంగా చర్లపల్లి దగ్గర మరో టర్మినల్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్నాం. చర్లపల్లి రైల్వే టర్మినల్‌కు భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంబర్పేట్, ఉప్పల్ ఫ్లైఓవర్లు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కొరవడిన కారణంగానే పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించకపోయినా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌ను కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయడం జరిగింది. కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి పెద్దఎత్తున భక్తులు వెళ్తారు. అక్కడ రైల్వేష్టేషన్ నిర్మాణానికి త్వరలోనే భూమిపూజ చేస్తాం. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడాలని డిమాండ్ చేస్తున్నాం కిషన్ రెడ్డి చెప్పారు.