కరీంనగర్ : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి తన మానవత్వాన్ని (Humanity)చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది. మానకొండూర్ మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ అనే యువతి ప్రమాదవశాత్తు లారీ కింద ఇరుక్కుపోయింది. ఇదే సమయంలో ములుగు పర్యటనకు వెళ్తున్న బండి సంజయ్ ప్రమాదాన్ని గమనించి తన వాహనాన్ని పక్కకు ఆపారు.
అటువైపు వెళ్తున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించి సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు యువతి జుట్టు కత్తిరించి లారీ కింద నుంచి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. గాయపడిన యువతిని కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. కాగా, చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని మంత్రి సంజయ్ హాస్పిటల్ వర్గాలకు తెలిపారు. సకాలంలో స్పందించి యువతిని కాపాడిన మంత్రిని పలువురు ప్రశంసించారు.