Bandi Sanjay | ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. కరీంనగర్లో శనివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుల ఫొటోలు పెడితే రేషన్ కార్డులు కూడా ఇవ్వబోమని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంటే రేషన్ బియ్యంపై ప్రధాని ఫొటో ఎందుకు పెట్టడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇకపై కొత్త రేషన్ కార్డులపై ముఖ్యమంత్రితో పాటు ప్రధానమంత్రి ఫొటో కూడా పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత బియ్యం ఎందుకు సరఫరా చేయాలని ప్రశ్నించారు. అవసరమైతే కేంద్రమే నేరుగా పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసే విషయాన్ని ఆలోచిస్తామని అన్నారు. తామే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని వ్యాఖ్యానించారు.
దావోస్ వేదికగా లక్షల కోట్ల రూపాయల పెట్టబడులపై ఎంవోయూలు జరిగాయంటూ జరుగుతున్న కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమంతా హాంబక్ అని బండి సంజయ్ కొట్టిపారేశారు. దావోస్ పెట్టుబడులకు సంబంధించి ఎంత మొత్తంలో ఎంవోయూలు జరిగాయి? ఎంత మందికి ఉద్యోగాలిస్తామన్నారనే విషయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని మరల్చిందుకే దావోస్ పెట్టుబడుల జాతర పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందక చస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నా స్పందించడం లేదని అన్నారు.