RTC Unions | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ప్రభుత్వం కార్మిక సంఘాలకు చెక్ పెట్టినట్టు తెలుస్తున్నది. వాటి స్థానంలో సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినట్టు తాజా పరిణామాలతో స్పష్టమవుతున్నది. అన్ని రీజియన్లు, జిల్లాలు, డిపోల వారీగా బోర్డులు ఏర్పాటు చేసి, వాటిలో సభ్యులను నియమించారు. ఈ సభ్యులందరికీ ఈ నెల 27న రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ యాజమాన్యానికి, సిబ్బందికి వెల్ఫేర్ బోర్డు సభ్యులు అనుసంధానకర్తల్లాగా పనిచేయాలి. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. పెండింగ్ అంశాలను దశలవారీగా పరిషారిస్తాం అని పేర్కొన్నారు. కార్మిక సంఘాలు లేకుండా చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ట్రేడ్ యూనియన్ల నేతలు మండిపడుతున్నారు. తక్షణం ఎంప్లాయ్ వెల్ఫేర్ బోర్డులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నెల 7 నుంచి సమ్మె నిర్వహించేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సమాయత్తమవగా.. వారిలో ఒక్కో సంఘాన్ని విడదీసి, విడతల వారీగా చర్చలు జరిపిన ప్రభుత్వం.. కార్మికుల సమస్యలు తీరుస్తామని, సంఘాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. సంఘాలు ఉండటం కార్మికులకు ఎంతో శ్రేయస్కరమని నాడు చర్చల సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ చెప్పారు. ఇప్పుడు వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయడమేమిటని, ప్రభుత్వం తమను నమ్మించి గొంతు కోసిందని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. కార్మిక సంఘాల పునరుద్ధరణే ప్రధాన ఎజెండాగా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో తాడోపేడో తేల్చుకోనున్నట్టు తెలిసింది. ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించకపోతే.. ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపకపోతే వెల్ఫేర్ బోర్డు సభ్యులు చెప్పిందే రాజ్యంగా నడుస్తదని కొందరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఏదైనా వారి ద్వారానే ప్రభుత్వానికి చేరడమనేది కష్టమని కొందరు అభిప్రాయపడుతున్నారు. కార్మిక సంఘాల నేతలతో మాట్లాడినంత ప్రేమగా.. తమ పైఅధికారులతో మాట్లాడలేమని అంటున్నారు. అన్ని హక్కులను బోర్డుల ద్వారా సాధించుకోలేమని, కార్మిక సంఘాలే ఉండాలని చెప్తున్నారు. ఇన్నాళ్లూ కార్మిక సంఘాలు లేకుండానే ఆర్టీసీని నడిపిన యాజమాన్యం.. ఎన్ని సమస్యలు పరిష్కరించిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మిక సంఘాలపై కక్షపూరిత ధోరణి మానుకోవాలని చెప్తున్నారు.