హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని కేంద్రఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రైవేటు టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ అందించడంలో రాష్ట్రం ప్రథమస్థానంలో నిలిచినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్ మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలో 49.39 శాతం టీకాలు ప్రైవేటు కేంద్రాల్లోనే అందించినట్టు తెలిపారు. వ్యాక్సినేషన్లో ఢిల్లీ (43.11 శాతం) రెండో స్థానంలో నిలిచిందని, కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని రాజేశ్‌భూషణ్ ఆందోళన వ్యక్తంచేశారు.
అత్యధిక కొత్త కేసులు నమోదవుతున్న జిల్లాల పేర్లను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకొనేందుకు కేంద్రప్రభుత్వ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నది. ఇప్పటికే కొవిన్ పోర్టల్‌లో నమోదుచేసుకున్న 75% ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్లకు టీకాలు వేశారు.
ప్రస్తుతం 60 ఏండ్లు పైబడినవారికి, దీర్ఘకాలిక వ్యాధులున్న 45-59 ఏండ్ల మధ్యవయస్కులకు టీకాలు వేస్తున్నారు. మంగళవారం 900 పైగా ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో టీకాలు వేశారు. ప్రభుత్వ కేంద్రాల్లో 38,500 మందికి, ప్రైవేటులో 6,006 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ టీకా ఇచ్చేందుకు కేంద్రా ల సంఖ్యను 2,200 దాకా పెంచనున్నట్టు చెప్పారు. ప్రైవేటులోనే 1,000 కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసి కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్రంనుంచి అనుమతి రాగానే వ్యాక్సినేషన్ మరింత వేగం కానున్నది.
ఇవీ కూడా చదవండి
కరీంనగర్‌కు కల్యాణ్ జ్యూవెల్లరీ
సినిమాలకు సెన్సార్ అవసరం లేదు!
రాజకీయ ప్రచారానికి వెళ్లినట్లనిపించింది!