నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 19 : ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్మి అకాల వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వాన కురియడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాలు, మార్కెట్లు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసింది. చెట్లు విరిగి రోడ్లపై పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పలుచోట్ల వడగండ్లు పడ్డాయి. వర్షానికి వరితోపాటు మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. మెదక్ జిల్లాలోని రామాయంపేట, చేగుంట, నార్సింగి, చిన్నశంకరంపేట మండలాల్లో ధాన్యం తడిసిముద్దయింది. వరి కోత దశలో ఉండగా వర్షం పడటంతో పంట నేలపాలైంది.
ఈదురుగాలులకు పలుచోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల, జిన్నారంలో వడగండ్లు పడ్డాయి. పటాన్చెరు, జేపీకాలనీ డివిజన్లతోపాటు ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీల పరిధిలో భారీగా ఈదురుగాలులు వీచాయి. రెండు గంటలకు పైగా కరెంట్ సరఫరా నిలియిపోయింది. పటాన్చెరు-సంగారెడ్డి రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. జిన్నారం మండలంలో సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో వడగండ్ల వాన కురిసింది. ఝరాసంగం మండలంలోని జీర్లపల్లి, చిలేమామిడి, ఏడాకులపల్లిలో భారీ వర్షం కురిసింది. జొన్న, మక్క పంటలు నేలవాలాయి. మామిడి, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. జీర్లపల్లి-చిలేమామిడి గ్రామాల మధ్య రహదారిపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. జీర్లపల్లిలో విద్యుత్ స్తంభం కూలింది. ఇంటి పైకప్పు ఎగిరిపడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో తేలికపాటి జల్లులు పడ్డాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, సిరికొండ, భిక్కనూరు తదితర మండలాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. సిరికొండ మండలంలోని రావుట్ల, సిరికొండ, న్యావనంది గ్రామాల్లో వడగండ్లు పడగా, చీమన్పల్లి, పందిమడుగు, గడ్కోల్ తదితర గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసింది. రావుట్ల, న్యావనంది గ్రామాల్లో చేతికి వచ్చిన పంట నేలవాలింది. భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి, రామేశ్వర్పల్లి, అంతంపల్లిలో కురిసిన వానకు వరి దెబ్బతిన్నది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సుమారు గంటన్నరపాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అకాల వర్షంతో ఎండ, ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించినప్పటికీ, రైతులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది.