Unemployment | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏటా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి అమలు చేస్తాం’ అంటూ యువత, నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రంగు బయటపడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, నిర్వహించిన పరీక్షలను కూడా తమ ఖాతాలో వేసుకొంటూ వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు బండారం వెలుగులోకి వచ్చింది. గత పదేండ్లలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు కేరాఫ్‌గా నిలిచిన తెలంగాణ ఇప్పుడు నిరుద్యోగానికి అడ్డాగా మారింది. నిరుద్యోగితలో దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో అధ్వాన్న పరిస్థితులు నెలకొనడమే దీనికి నిదర్శనం. ఈ విషయాన్ని జూలై నాటికి సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్-2024, రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంటెంపరరీ స్టడీస్ నేతృత్వంలో నిర్వహించిన తెలంగాణ ఎంప్లాయ్మెంట్ స్టడీ-2024 నివేదికలు వెల్లడించాయి.
పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే-2024 ప్రకారం.. 15-59 ఏండ్ల మధ్య వయసున్న వారిలో దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు సగటున 3.5% నమోదైతే, తెలంగాణలో ఇది 5.1 శాతంగా రికార్డయ్యింది. 15-29 ఏండ్ల మధ్య వయసున్న వారిలో దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు సగటున 10.2% ఉంటే, తెలంగాణలో 16.6 శాతంగా నమోదైంది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో నిరుద్యోగిత రేటు 6.4% ఎక్కువగా ఉన్నది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయనడానికి ఇదే నిదర్శనమని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ ఈ సందర్భంగా వెల్లడించింది. నిరుద్యోగిత అంశంలో తెలంగాణతో పోలిస్తే బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ర్టాలు ఎంతో మెరుగ్గా ఉన్నట్టు నివేదిక గుర్తు చేసింది.
రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు పెచ్చరిల్లడానికి గల కారణాలను తెలంగాణ ఎంప్లాయ్మెంట్ స్డడీ-2024 నివేదిక వివరించింది. కంపెనీల ఏర్పాటులో మందగమనం, పారిశ్రామికరంగంలో ఆశావహ దృక్పథం సన్నగిల్లడం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను సిలబస్‌లో బోధించకపోవడం, అసంఘటితరంగంలో శ్రామికవాటా పెరిగిపోవడం తదితర అంశాలు తెలంగాణలో నిరుద్యోగానికి కారణంగా నివేదిక అభిప్రాయపడింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, పట్టణప్రాంతాల్లో నిరుద్యోగం మరింత ఎక్కువగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. గ్రామీణప్రాంతాల్లో నిరుద్యోగం 9.7 శాతంగా ఉంటే, పట్టణప్రాంతాల్లో 25.4 శాతంగా ఉన్నట్టు వివరించింది. ముఖ్యంగా డిగ్రీ పట్టా తీసుకొన్న గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మారుతున్నారని, కాలేజీ గ్రాడ్యుయేట్లలో 20% మంది, డిప్లొమా తీసుకొన్న విద్యార్థుల్లో 19.7% మంది ఎలాంటి ఉపాధి అవకాశాలులేకుండా మిగిలిపోతున్నట్టు నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యోగాలకు అడ్డాగా మారింది. పదేండ్ల వ్యవధిలో కేసీఆర్ సర్కారు 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటు రంగంలో మరో 22.5 లక్షల ఉద్యోగ కల్పనను చేపట్టింది. వెరసి మొత్తంగా 25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టయ్యింది. దక్షిణ భారతదేశంలో ఉపాధి కల్పనలో తెలంగాణ తొలి ర్యాంకును సాధించగా, దేశవ్యాప్తంగా మూడో స్థానాన్ని కైవసం చేసుకొన్నది. పురుషులకు సంబంధించి ఉద్యోగాల్లో దేశంలోనే తెలంగాణ రెండో ర్యాంకులో నిలిచింది. ఈ మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో),పీరియాడిక్ లేబర్ ఫోర్స్-2023 తమ నివేదికల్లో వెల్లడించాయి.