Police Jobs | హైదరాబాద్ : ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తక్షణం నోటిఫికేషన్లు జారీ చేయాలని పోలీసు నిరుద్యోగ అభ్యర్థుల జేఏసీ డిమాండ్ చేసింది. గతంలో జీవో-46తో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు పోలీసు నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 2016, 2018, 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నోటిఫికేషన్లో 15 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోలీసు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కాలయాపన చేయకుండా పోలీసు ఉద్యోగార్థులకు త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ అమలుకు నోచుకోకపోవడంపై వారు ధ్వజమెత్తారు. కొత్తగా విడుదల చేసే పోలీసు జాబ్ నోటిఫికేషన్లలో వయో పరిమితిని 35 ఏండ్లకు పెంచాలన్నారు. మరి ముఖ్యంగా ఆంధ్రా పోలీసు అధికారి పీవీ శ్రీనివాస్ రావును పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా తప్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పోలీసు అభ్యర్థుల నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆకాశ్, శంకర్, కల్యాణ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.