హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ‘అంతన్నడు ఇంతన్నాడే గంగCరాజు.. నట్టేట్ల ముంచుతున్నడే గంగరాజు’ అన్న ఓ సినిమా పాటను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిజం చేస్తున్నారు. ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఇచ్చిన హామీలను ఇప్పుడు ఒక్కొక్కటిగా తుంగలో తొక్కతున్నారు. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల హామీ ఊసే ఎత్తడం లేదు, జాబ్ క్యాలెండర్ ప్రస్తావనే తేవడం లేదు. రెండున్నరేండ్లు దాటాక కూడా అరకొర ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తూ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. దీంతో రేవంత్ సర్కార్ ద్రోహం చేస్తున్నదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో రోజూ పలుచోట్ల నిరసనలకు దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర టౌన్ ప్లానింగ్ విభాగంలో దాదాపు 200 వరకు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసిన నోటిఫికేషన్ నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొత్తం ఖాళీల్లో 10 పోస్టుల భర్తీకి మాత్రమే ప్రభుత్వం అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. జూలై 10 నుంచి ఆగస్టు 17 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించినప్పటికీ, పట్టుమని 10 పోస్టుల కోసం లక్షలాది మంది పోటీ పడాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టౌన్‌ప్లానింగ్ విభాగమే కాకుండా, అత్యంత కీలకమైన పోలీస్ శాఖలోనూ నిరుద్యోగులకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. రాష్ట్రంలో సుమారు 20 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులు వేడుకొంటున్నా, రేవంత్ సరార్ మాత్రం కేవలం 7,347 పోస్టులనే భర్తీ చేస్తామంటూ కోతలు విధిస్తున్నది. మొత్తం ఖాళీలను భర్తీ చేయకుండా, ఇలా నామమాత్రపు పోస్టులతో నోటిఫికేషన్లు ఇస్తూ నిరుద్యోగులను మభ్యపెట్టాలని చూస్తే ఊరుకొనేది లేదని, అన్ని ఖాళీలను చేర్చి తక్షణమే మెగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.