చిక్కడపల్లి, జూలై 28 : నిరుద్యోగుల్లో నివురుగప్పిన నిప్పులా నెలకొన్న ఆగ్రహం పెల్లుబుకింది. అధికారంలోకి రాగానే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీని నమ్మిన విద్యార్థులు.. ఇప్పుడు మోసపోయామంటూ సర్కార్‌పై సమరశంఖం పూరించారు. ఉద్యోగాలు ఇచ్చామంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెప్తున్న లెక్కలన్నీ తప్పులతడక అని ఎండగట్టారు. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నిర్వహించిన చర్చా కార్యక్రమం… వాడివేడిగా సాగింది. కార్యక్రమానికి హాజరైన సుమారు 700 మంది నిరుద్యోగ యువత నుంచి సర్కారుపై భగ్గుమన్న కోపాగ్నికి వేదికగా మారింది. ముఖ్యమంత్రి, మంత్రులు అసత్య ప్రచారంతో కాలయాపన మానుకోవాలని, లేకపోతే ఉద్యమసెగ తప్పదని నిరుద్యోగులు హెచ్చరించారు. విద్యావంతులు నిర్మాణాత్మకంగా నిలదీయడంతో అద్దంకి దయాకర్ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. జరిగిందంతా సీఎం రేవంత్‌కు చెప్తానంటూ ఆయన వెళ్లిపోయారు.
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో చర్చించేందుకు ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్లిన అద్దంకి దయాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన రెండులక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని, జాబ్ క్యాలెండర్ ఏమైందని.. అద్దంకి దయాకర్‌ను నిరుద్యోగులు నిలదీశారు. ఏడాదిన్నర గడిచినా ఉద్యోగాలపై ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల లెక్కలు చెప్పాలని నిలదీశారు. ఉద్యోగాలు ఇచ్చామంటూ అద్దంకి లెక్కలు చెప్పే ప్రయత్నం చేయగా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అవి బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లే కదా అనీ.. కాంగ్రెస్ చెప్పిన రెండు లక్షల ఉద్యోగాల సంగతేంటనీ.. గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలను మీ ఖాతాలో ఎలా వేసుకుంటారనీ.. ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5వేలు మాత్రమేనని లెక్కలు సహా వివరించారు. పైగా చర్చించడానికి వచ్చామంటూ.. లైబ్రరీ వద్ద పోలీసులను భారీగా మోహరించడం ఏంటని.. అద్దంకి దయాకర్‌ను నిలదీశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మాటలు నమ్మి.. మద్దతు తెలుపుతూ బస్సు యాత్రలు చేశామని చెప్పారు. కానీ ఇప్పుడు తమ సమస్యలు వినేందుకు సీఎం రేవంత్‌రెడ్డికి సమయం దొరకడంలేదా? అని ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు నిరుద్యోగుల జపం చేసిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు తమ గోడును పట్టించుకోవడంలేదని యువతీయువకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు తమ ఆవేదన అరణ్యరోదనగా మారిందని వాపోయారు. ఏడాదిన్నరగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వేడుకుంటుంటే.. ప్రభుత్వం, మంత్రులు, ప్రజాప్రతినిధులు సరైన సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరిని అడిగినా ‘త్వరలో.. త్వరలో..’ అంటూ దాటవేస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో అంటే ఎప్పుడో చెప్పాలంటూ అద్దంకి దయాకర్‌ను సూటిగా ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి అస్పష్టమైన సమాధానాలు వినే ప్రసక్తేలేదని, ఆగస్టు 15లోగా నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఉద్యమం తప్పదని, గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థులతో చర్చించేందుకు వచ్చిన అద్దంకి దయాకర్.. వారి ఆగ్రహాన్ని చవిచూసి.. వెనుదిరగాల్సి వచ్చింది. చర్చల సారాంశాన్ని ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వివరిస్తానని వెళ్లిపోయారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, కార్యదర్శి పద్మజ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగుల కృషి ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ నేడు రేవంత్‌రెడ్డికి నిరుద్యోగుల సమస్యలు పట్టించుకునే సమయం దొరకడంలేదు. ఆగస్టు 15 వరకు నోటిఫికేషన్ ప్రకటించకపోతే నిరుద్యోగులతో కలిసి గాంధీభవన్ ముట్టడిస్తాం.
కాంగ్రెస్ నేతలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. నిరుద్యోభృతి కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నది. ఆ పార్టీ హామీ మేరకు ప్రతీ నిరుద్యోగికి రూ.72 వేలు ప్రభుత్వం బకాయి పడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం సిలబస్ కమిటీ పేరుతో మభ్యపెట్టింది. కమిటీ ఏర్పాటు చేసి 6 నెలలు గడుస్తున్నది. కమిటీ ఎప్పుడైనా సమావేశమైందా? సిలబస్‌పై చర్చించిందా? సిలబస్ మారిందో లేదో స్పష్టతనివ్వాలి. మార్పులుంటే కొత్త సిలబస్ ప్రకారం చదువుకుంటాం. కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదు?
కాంగ్రెస్ మెగా డీఎస్సీ హామీ ఇచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదు. మెగా డీఎస్సీ ఊసేలేదు. ప్రభుత్వ తరపున మాట్లాడుతున్న వాళ్లు.. హామీ ఇస్తున్నారు. కానీ పరిష్కారం చూపడంలేదు. నిరుద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పిస్తుందో తెలిపాలి.
నిరుద్యోగులు ప్రస్తావించిన సమస్యలను ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. ప్రభుత్వం, నిరుద్యోగులకు వారధిగా ఉంటాను. ఈ అంశంపై రెండు రోజుల్లో స్పష్టతనిస్తా. బోనాల పండుగకు గ్రంథాలయానికి వచ్చినప్పుడు నన్ను నిలదీస్తారని అనుకోలేదు. ‘త్వరలోనే’ అనే పదం ఎంత ప్రమాదకరమో ఇప్పుడే తెలిసింది. ఈ పదం వాడటాన్ని నిషేధించుకుంటున్నాను