(నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ‘లాఠీచార్జ్ ప్రజాస్వామ్య మార్గం కాదు. ప్రశ్నలు అడిగినందుకు యువతను కొట్టడం సరైంది కాదు. పార్లమెంట్లో నిలదీస్తాం’ – మంగళవారం ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యలను ఖండిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలివి. ఇప్పడు మాత్రమే కాదు.. ఆగస్టు 2025లో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఎస్సెస్సీ విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను సైతం ఖండించారు. బీహార్ రాజధాని పాట్నాలో బీపీఎస్సీ టీచర్ అభ్యర్థుల మీద జరిగిన లాఠీచార్జీని కూడా ఖండించారు. తాజాగా ఢిల్లీలో సీజేపీ, నీట్ విద్యార్థులపై పోలీసు చర్యను నిరసించారు. లాఠీచార్జ్ క్రూరమైనదని, సిగ్గుచేటు అని, పిరికి ప్రభుత్వ లక్షణం అంటూ ఘాటుగా విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడుసార్లు నిరుద్యోగుల మీద లాఠీచార్జ్ జరిగింది. గత ఆరు నెలల్లో జరిగిన ఘటనలను పరిశీలిస్తే దిల్సుఖ్నగర్, అశోక్‌నగర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ, మెట్రోస్టేషన్.. ప్రతిచోటా ఒకే దృశ్యం పునరావృతమైంది. ప్రభుత్వాన్ని నోటిఫికేషన్లు అడిగితే ‘లాఠీ’ఫికేషన్లు ఇచ్చింది. చివరికి ప్రభుత్వమే విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ గురించి ప్రశ్నిస్తే లాఠీలే సమాధానం ఇచ్చాయి. కానీ, రాహుల్‌గాంధీకి ఇవేమీ కనిపించలేదు. కాంగ్రెస్ అగ్రనేత ద్వంద్వ వైఖరికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నచోట ఒకరకంగా, ఇతర ప్రభుత్వాలు ఉన్నచోట మరోతీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
‘రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని, ఊరూరు తిరుగుతున్న రాహుల్‌గాంధీ.. సొంత పార్టీ ఏలుబడిలోని తెలంగాణలో హకుల ఉల్లంఘన జరుగుతుంటే, నిరుద్యోగుల మీద లాఠీలు లేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఓట్లు దండుకోవడానికి ఇచ్చిన హామీలను నీరుగార్చి, ఉద్యోగాలడితే లాఠీ దెబ్బలు బహుమతిగా ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు పల్లెత్తు మాట కూడా అనడం లేదు? నీట్ పేపర్ లీకేజీకి, విద్యార్థులపై లాఠీచార్జ్‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని, ప్రధాని మోదీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ.. తెలంగాణలో పేపర్ లీకేజీలపై నోరుమెదపకుండా, నిరుద్యోగుల ఒంటిపై లాఠీలు విరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అదే సూత్రం తెలంగాణకు వర్తించదా? రాష్ట్రంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దే ఉన్నదని తెలిసి కూడా ఇంకా కొనసాగించడం ద్వంద్వ నీతి కాదా? ఢిల్లీకో న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా? తెలంగాణ నుంచి వెళ్తున్న మూటలు ఆయన మాటలకు అడ్డం పడుతున్నాయా?’ అని యువత ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తెలంగాణ యువత కొత్త కోరికలు కోరడం లేదు కదా! అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 మే 30న రాహుల్‌గాంధీ హైదరాబాద్‌కు వచ్చి అశోక్‌నగర్ లైబ్రరీ మెట్లెకి, ముషీరాబాద్‌లో నిరుద్యోగుల భుజం తట్టి ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో హామీలు గుప్పించారు. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. వడ్డీలేని రుణాలు, కాలేజీలో చదివే యువతులకు ఎలక్ట్రిక్ సూటర్లు, విద్యాభరోసా కార్డులు ఇస్తామని డిక్లరేషన్‌లో ప్రకటించారు. మేము అడుగుతున్నది వీటినే కదా?’ అని నిరుద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు ‘నేను మీతోనే ఉంటాను. అన్యాయం జరిగితే నిరుద్యోగుల పక్షాన నిలబడుతాను’ అని రాహుల్‌గాంధీ నాడు చెప్పిన మాటలనే ఇప్పుడు వారు గుర్తుచేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీలు, నోటిఫికేషన్లు ఇవ్వాలని అడిగితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ‘లాఠీ’ఫికేషన్ ఇస్తున్నదని మండిపడుతున్నారు. నాడు తమ వెంట ఉంటానని చెప్పిన రాహుల్‌గాంధీ ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీలో నీట్ పేపర్ లీక్‌పై నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసు చర్య నేపథ్యంలో ‘దేశ చరిత్రలోనే మోదీ అత్యంత యువత వ్యతిరేక ప్రధాని’ అని రాహుల్‌గాంధీ నిప్పులు కకారు. టియర్ గ్యాస్, లాఠీచార్జి ప్రజాస్వామ్య పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్ సభ స్పీకర్‌ను స్వయంగా కలిసి పార్లమెంట్లో చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ శిబిరం మొత్తం నినదించింది. మరి తెలంగాణలో నిరుద్యోగులపై లాఠీదెబ్బలు పడుతున్నా రాహుల్‌గాంధీ నోటి నుంచి ఒకమాట కూడా ఎందుకు రావడం లేదు? ఒక్క ట్వీట్ కూడా ఎందుకు వేయడం లేదు? ఢిల్లీలో లాఠీ పడితే ప్రజాస్వామ్య హననం అయినప్పుడు తెలంగాణలో రాజధర్మం అవుతుందా? కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తే.. తెలంగాణలో విద్యాశాఖను తన ఆధీనంలో పెట్టుకున్న ముఖ్యమంత్రికి ఆ సూత్రం వర్తించదా? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
