లక్నో: ఫ్లైదుబాయ్ విమానాన్ని పైలట్లు దారి మళ్లించారు. నిర్దేశించిన గమ్యస్థానానికి బదులుగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేశారు. అయితే నిర్దేశించిన గమ్యస్థాన ఎయిర్‌పోర్ట్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా ఆ విమానాన్ని దారి మళ్లించినట్లు ఫ్లైదుబాయ్ సంస్థ పేర్కొంది. (flydubai) శనివారం ఫ్లైదుబాయ్ ఫ్లైట్ ఎఫ్‌జెడ్ 1165, దుబాయ్ నుంచి థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు బయలుదేరింది. అయితే ఆ విమానం గమ్యస్థానమైన ఫుకెట్ విమానాశ్రయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఫ్లైదుబాయ్ విమానాన్ని పైలట్లు దారి మళ్లించారు. శనివారం సాయంత్రం 6.53 గంటలకు లక్నో ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
కాగా, విమానం దారి మళ్లింపుపై ఫ్లైదుబాయ్ సంస్థ వివరణ ఇచ్చింది. గమ్యస్థానమైన ఫుకెట్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ మళ్లింపు జరిగినట్లు తెలిపింది. ఆ విమానానికి సంబంధించి ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తలేదని స్పష్టం చేసింది. లక్నోలో జరిగిన ల్యాండింగ్ సాధారణ, సురక్షితమైనదిగా పేర్కొంది. ఇది అత్యవసర ల్యాండింగ్ కాదని, విమానానికి సంబంధించి ఎటువంటి అత్యవసర పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేశారు.