Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుండగా.. సినిమాలోని కీలక యాక్షన్ సన్నివేశాల కోసం భారీ స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ‘వారణాసి’లోని ఓ ప్రత్యేక యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్లో మహేష్ బాబుతో పాటు సినిమాలోని ఇతర ప్రధాన పాత్రలపై కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ పోరాట ఘట్టాలు ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలకు భిన్నంగా, మరింత భారీగా, వైల్డ్‌గా ఉండనున్నాయని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మహేష్ బాబు ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. అలాగే శ్రీరాముడి పాత్రలోనూ ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండగా.. ఈ చిత్రంలో ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. ఇక సినిమాకు సంగీతం అందిస్తున్న ఎం.ఎం. కీరవాణి ఇప్పటికే నేపథ్య సంగీతం పనులను ప్రారంభించినట్లు సమాచారం. రాజమౌళి సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ఉండే ప్రాధాన్యత దృష్ట్యా ‘వారణాసి’లో కీరవాణి సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
‘వారణాసి’ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా నిర్మాణ వ్యయం రూ.1300 కోట్లకు పైగానే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కథ, కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందిస్తుండగా.. దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు. భారీ స్థాయి నిర్మాణ విలువలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన యాక్షన్ సన్నివేశాలు, స్టార్ నటీనటుల కలయికతో ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన రావడంతో.. సినిమాలోని తదుపరి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు–రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందోననే ఆసక్తి నెలకొంది.