Mad Sandhu : పంజాబ్‌లో కాల్చివేతలు సాధారణం అయిపోతున్నాయి. నిత్యం ఎవరో ఒకరు.. ఎవరో ఒకరిని కాల్చి చంపుతూనే ఉన్నారు. తాజాగా ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్, ఎల్జీబీటీక్యూ+ ఇన్ఫ్లుయెన్సర్ మ్యాడ్ సంధు అలియాస్ మధుసూదన్ సంధు హత్యకు గురయ్యారు. ఈ ఘటన అక్టోబర్ 3, శనివారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాలివి. శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో మ్యాడ్ సంధు అమృత్‌సర్‌లో ఉన్న లోహార్కా రోడ్‌లోని ఒక కార్ వాషింగ్ సెంటర్‌కు వెళ్లాడు.
ఈ సమయంలో మోటార్ బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు మ్యాడ్ సంధుపై కాల్పులు జరిపారు. అనేక రౌండ్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మ్యాడ్ సంధు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావం అయిన అతడిని వెంటనే స్తానికులు సమీపంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాల్ని పరిశీలించారు.
ఈ కాల్పులకు పాల్పడింది తామే అని సోషల్ మీడియా వేదికగా గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ ప్రకటించారు. మ్యాడ్ సంధు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే, మేకప్ ఆర్టిస్ట్‌గా, స్టైలిష్టుగానూ గుర్తింపు ఉంది. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 లక్షల మంది ఫాలోవర్లున్నారు. యూట్యూబ్‌లోనూ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఇక.. మ్యాడ్ సంధును హత్య చేయడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.