హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోటీకి నిరుద్యోగ జేఏసీ నేతలు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా 30 మందికి పైగా నామినేషన్లు వేయించాలని జేఏసీ కమిటీలు నిర్ణయించాయి. నిరుద్యోగులను నిలువునా ముంచిన కాంగ్రెస్ను ఓడించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో, దిల్సుఖ్నగర్లో సమావేశమైన నిరుద్యోగ జేఏసీ నేతలు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం 30 మంది అభ్యర్థులతో నామినేషన్లు వేయిస్తామని, తర్వాత మరింత మందితో వేయిస్తామని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కందరపల్లి కాశీనాథ్, ఉపాధ్యక్షుడు భూక్యా కుమార్, ప్రధాన కార్యదర్శి ఆర్కే వన్నార్ చోళ.. ఓయూలో సమావేశం అనంతరం ప్రకటించారు.
జాబ్ క్యాలెండర్, మోగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలంటూ నిరుద్యోగులను మచ్చిక చేసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు అదే నిరుద్యోగులను సర్కార్ విస్మరించిందని ఆరోపించారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పడమే ధ్యేయంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము నిర్ణయించినట్టు తెలిపారు. నిరుద్యోగులంతా జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ఇల్లిల్లూ తిరిగి కాంగ్రెస్ను ఓటమికి దోహదపడాలని పిలుపునిచ్చారు. మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నిరుద్యోగులను వంచించిన కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి బుద్ధ్ది చెప్పడమే ధ్యేయంగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులం పోటీ చేస్తామని దిల్సుఖ్నగర్ వివేకానందనగర్లో సమావేశమైన నిరుద్యోగ జేఏసీ నాయకురాలు ఆస్మా, ఇతర నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యంగా పోటీ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. ఆస్మాను తమ తరఫున జుబ్లీహిల్స్ ఎన్నికల బరిలో నిలిపేందుకు నిర్ణయించామని ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ను మట్టి కరిపిస్తామని ఈ సందర్భంగా ఆస్మా ప్రకటించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హమీలు గుప్పించి తీరా ప్రభుత్వంలోకి వచ్చాక తమను పట్టించుకోవడమే లేదని ఆరోపిస్తున్నారు. వేలాది మంది నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరుతామని ఆమె సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పలువురు నిరుద్యోగ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.