ఖైరతాబాద్, నవంబర్ 19 : రాష్ట్రంలో రిజర్వేషన్ల ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర లు పన్నుతున్నదని నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు జనార్దన్, ఇందిరానాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఏదో ఒరగబెడుతుందని భావించి ఓట్లు వేశామని, ఇప్పుడు అది తప్పని తేలిందని పేర్కొన్నారు. గ్రూప్-1 మెయిన్స్ ఎంపిక ప్రక్రియలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పక్కనబెట్టే కుట్రలు చేస్తున్నారని, తద్వారా ఎస్సీ, ఎస్టీ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగనున్నదని ఆరోపించారు.
ఏ ఉద్యోగానికైనా పరీక్షల స్థాయి నుంచి ఉద్యోగం వరకు తొలుత ఓపెన్ మెరిట్ లిస్టు, ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజ్వేషన్లు అమలుచేయాల్సి ఉంటుందని, కానీ ఫలితాలు రాగానే ఒకే మెరిట్ లిస్టు ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రే అనేక సభలు, సమావేశాల్లో వెల్లడిస్తున్నట్టు తెలిపారు. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులను ఉద్యోగాలకు దూరం చేయడమే అవుతుందని, గ్రూప్-1లోనూ ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామంటూ దేశవ్యాప్తంగా తిరుగుతున్న రాహుల్‌గాంధీ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, మెగా డీఎస్సీ, గ్రూప్ పోస్టుల పెంపు, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన హామీలను నెరవేర్చాలని డిమాం డ్ చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని చెప్పి ప్రచారం చేసిన కాం గ్రెస్ నేతలు, ఇప్పుడు అదే రిజర్వేషన్లను రద్దు చేసే పన్నాగం పన్నుతున్నట్టు ఆరోపించారు. నిరుద్యోగులపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే జీవో-29 రద్దుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులతో కలిసి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డాక్టర్ నర్సింహ, హరినాయక్, విజయ్‌రెడ్డి, నరేందర్, మహేశ్‌గౌడ్, యుగేంధర్, అభినవ్, అర్జున్, శివానంద, స్వామి తదితరులు పాల్గొన్నారు.