హైదారాబాద్, మే 11( నమస్తే తెలంగాణ) : ఇప్పటికే గాంధీ భవన్‌లోకి ‘నమస్తే తెలంగాణ, టీ న్యూస్’ ప్రతినిధులు రాకుండా నిషేధాజ్ఞలు విధించిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించే ప్రత్యేక మీడియా సమావేశాలకు కూడా అప్రకటిత ఆజ్ఞలు వర్తింపజేశారు. చిట్‌చాట్‌లో సీఎం చెప్పింది విని రాసుకునే మీడియాను మాత్రమే పిలువాలని, ఎదురు ప్రశ్నించే వారిని దూరంగా ఉంచాలని ముఖ్యంగా నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ప్రతినిధులను పిలువొద్దని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రెస్మీట్లో అయితే మీడియా ప్రతినిధులు ప్రతి మాటను రికార్డు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ముఖ్యంగా నోరు జారిన మాటలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయని గమనించిన సీఎంవో అధికారులు ప్రెస్‌మీట్ స్థానంలో చిటిచాట్ పెట్టాలని సీఎంకు సూచించినట్టు తెలిసింది.
ఇదేదో బాగానే ఉందనే ఆలోచనతో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినా..హైదరాబాద్‌లోనైనా మీడియా సమావేశం స్థానంలోనే చిట్‌చాట్ నిర్వహిస్తున్నారు. ఈ చిట్‌చాట్‌లో పిచ్చాపాటిగా మాట్లాడుకోవటమే తప్ప రికార్డు ఉండదు. సీఎం సెక్యూరిటీ అధికారులు మరింత జాగ్రత్త తీసుకొని జర్నలిస్టుల ఫోన్లు తీసుకున్న తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన చిట్‌చాట్‌కు కూడా ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధులను ఆహ్వానించలేదు. ప్రభుత్వ జీతంతో విధులు నిర్వర్తించే సీపీఆర్వో అన్ని మీడియా సంస్థలకు సమాచారం కనీస బాధ్యత. కానీ కొన్ని సంస్థలకు మాత్రమే వ్యక్తిగత సమాచారం ఇవ్వడాన్ని జర్నలిస్టు సంఘాలు తప్పు పడుతున్నాయి.