హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ల పేరిట రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాథమిక హకులను కాలరాస్తున్నారని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్‌గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. దళితులు, బలహీనవర్గాలను సాంఘిక బహిషరణలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ అధ్యక్షతన వివిధ సామాజిక, గౌడ సంఘాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం లో పల్లె రవి మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్‌లో ఆరు నెలలుగా కల్లుగీత కార్మికులను సాంఘిక బహిషరణకు గురిచేసిన వీడీసీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీరామనవమి సందర్భంగా గౌడ మహిళలను గుడి నుంచి గెంటివేసి, ఈత చెట్లను కాల్చివేసిన దుర్మార్గులను తక్షణమే అరెస్టు చేయాలని, వీడీలను నిషేధించాలని డిమాండ్ చేశారు.