తెలంగాణ చౌక్/సిరిసిల్ల టౌన్, నవంబర్ 9: అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు భరించలేక నేతన్న దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక.. సాంచా లు నడవక బతుకు భారమై మనస్తాపం చెం దారు. చేసిన అప్పులు తీర్చే దారిలేక బలవన్మరణానికి ఒడిగట్టారు. శనివారం జరిగిన ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలో తీవ్ర విషాదం నిం పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 37 వ వార్డు వెంకంపేటకు చెందిన బైరి అమర్ (41), స్రవంతి (37) మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి 13 ఏండ్ల కిందట బతుకుదెరువు కోసం వలస వచ్చారు. అమర్ రూ.20 లక్షల బ్యాంకు లోను తీసుకుని ఓ చిన్నపాటి ఇల్లు కొనుక్కున్నాడు. అందులో రెండు జోడీల సాంచాలు వేసుకుని ఉపాధి పొందుతున్నా డు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలు నేచాడు. కొత్త ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకపోవడంతో సాం చాలను అమ్ముకుని, ప్రత్యామ్నాయంగా బెడ్షీట్ల తయారీ వ్యాపారం చేస్తున్నాడు.
ఇంటి కోసం బ్యాంకు లోనుతోపాటు వ్యాపారం విస్తరించేందుకు తెలిసిన వాళ్ల వద్ద అప్పులు చేశా డు. ఆ వ్యాపారం కూడా సరిగా నడవక, తెచ్చి న అప్పులకు వడ్డీ పెరిగి సుమారు రూ.96 ల క్షల వరకు అప్పు అయ్యినట్టు అమర్ మామ మైసయ్య తెలిపారు. అప్పులు ఇచ్చినవాళ్లు డబ్బుల కో సం తీవ్రంగా వేధించడంతో మనస్తాపం చెం దారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు లహరి(15), శ్రీవల్లి (14), కొడుకు దీక్షిత్ (12) ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలయ్యారు. భార్యాభర్తలు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కలిచివేసింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమా ర్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సాంచాల సంక్షోభంతో సిరిసిల్ల పట్టణంలో ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల సంఖ్య 10కి చేరింది.