న్యూఢిల్లీ: గూండారాజ్యం ఆమోదయోగ్యం కాదు అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో ఓ న్యాయవాదిపై జరిగిన దాడి కేసులో సుప్రీం(Supreme Court) ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ న్యాయవాది దాఖలు చేసిన అత్యవసర పిటీషన్ పై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను ఆశ్రయించాలని కోరింది. ఫిబ్రవరి 7వ తేదీన తీస్ హజారీ కోర్టులో నిందితుడి తరపున వాదిస్తున్న లాయర్‌పై మరో వర్గానికి చెందిన లాయర్, అతని మనుషులు కోర్టులోనే దాడి చేశారు. జడ్జీ ముందునేగా ఆ అటాక్ జరిగింది. కోర్టులో అందరు ఉన్నప్పుడే ఈ ఘటన జరిగినట్లు ఆ న్యాయవాది తన పిటీషన్లో పేర్కొన్నారు.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌పై స్పందిస్తూ.. జనవరి 7వ తేదీన జరిగిన ఘటన గురించి ఢిల్లీ హైకోర్టు సీజేకు ఇన్ఫార్మ్ చేశారా అని సుప్రీం ప్రశ్నించింది. ఢిల్లీ హైకోర్టు సీజేకు లేఖ రాసి, ఆ లేఖను తనకు కూడా పంపమని సుప్రీం సీజే అన్నారు. తొలుత హైకోర్టు చీఫ్ జస్టిస్ దీనిపై స్పందించాలన్నారు. అయితే పరిపాలనా విభాగం చర్యలు తీసుకుంటుదని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ఇలాంటి గుండారాజ్యం తమకు ఆమోదయోగ్యం కాదు అని, అంటే ఇక్కడ చట్టం విఫలమైనట్లే అని పేర్కొన్నది. తమ పరిధిలో ఉన్న హైకోర్టుకు వెళ్లాలని కోర్టు చెప్పింది.