బీబీనగర్, ఫిబ్రవరి 09 : బీబీనగర్‌లోని రాక్వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్లోబల్ విద్యా అనుభవాల మార్పిడికి వేదికగా నిలిచింది. వివిధ దేశాలకు చెందిన సుమారు 70 మంది విదేశీ ఉపాధ్యాయులు పాఠశాలను సందర్శించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరంజిని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాల చైర్మన్ రామానాయుడు ఆలోచనల మేరకు ఈ అంతర్జాతీయ ఉపాధ్యాయుల సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. తరగతి గదుల పరిశీలన, విద్యార్థులతో ప్రత్యక్ష పరస్పర చర్చల ద్వారా ఈ కార్యక్రమం కొనసాగిందన్నారు. సందర్శన సమయంలో విదేశీ ఉపాధ్యాయులు తరగతి గదుల్లో విద్యార్థులతో చురుకుగా మమేకమై, నూతన బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యాస విధానం, ఉత్సాహ భరితమైన తరగతి వాతావరణాన్ని ప్రశంసించారని తెలిపారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో తమ సంభాషణా నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన సామర్థ్యాన్ని ప్రదర్శించారని అన్నారు.
పెరూ, కంబోడియా, మెక్సికో, కజాఖిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఒకే వేదికపై కలుసుకుని నాణ్యమైన విద్య పట్ల తమ నిబద్ధతను వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎఫ్ఎల్యూ విశ్వవిద్యాలయానికి చెందిన ఈఎల్టీ ప్రొఫెసర్ సువర్ణ విదేశీ ఉపాధ్యాయ బృందంతో ఆలోచనాత్మక చర్చలు జరిపి విలువైన సూచనలు అందించారని తెలిపారు. ఈ అంతర్జాతీయ సందర్శన రాక్వుడ్స్ స్కూల్ అధ్యాపక బృందానికి కూడా ప్రేరణనిచ్చే అనుభవంగా నిలిచిందని, ప్రపంచ స్థాయి దృష్టితో విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇలాంటి విద్యా కార్యక్రమాలను భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.

గ్లోబల్ విద్యా మార్పిడికి వేదికగా బీబీనగర్ రాక్వుడ్స్ పాఠశాల