నెన్నెల, ఆగస్టు 7 : తన తల్లి ప్రవర్తన చూడలేక ఓ కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ (22) సెంట్రింగ్ మేస్త్రీగా పని చేస్తున్నాడు. అతడి తల్లి ఆవుడం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ మంగళి తిరుపతితో కొంతకాలంగా చనువుగా ఉంటున్నది. ఈ విషయం తెలిసిన అనిల్ పద్ధతి మార్చుకోవాలని తల్లికి సూచించాడు. ఈ విషయమై మంగళవారం తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అనిల్ పురుగుల మందుతాగగా గమనించిన స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న అనిల్.. తన మరణానికి తల్లి, మంగళి తిరుపతే కారణమని వీడియోలో తెలిపాడు. బుధవారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలిసిన తిరుపతి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.
అనిల్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రసాద్ కేసునమోదు చేసుకొని శవ పంచనామా జరిపించారు. మృతదేహం ఆవుడం చేరుకోగానే గ్రామస్థులు అంబులెన్స్‌లో నుంచి తీసి తిరుపతి ఇంట్లోకి తీసుకెళ్లి నిప్పుపెట్టారు. పోలీసులు మంటలు వ్యాపించకుండా చేశారు. పోలీసులకు అనిల్ స్నేహితులు, బంధువులు, గ్రామస్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, డివిజన్లోని పోలీసులు, 25 మంది బెటాలియన్ పోటీసులు వచ్చి పరిస్థితి చేజారకుండా చూశారు. ఏసీపీ గ్రామ పెద్దలను పిలిచి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో అనిల్ మృతదేహాన్ని గంగారం తీసుకెళ్లారు.