Gandhi Bhavan | హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగ యువత అధికార కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడమే కాకుండా, జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించి, ఏ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. అందుకు అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేయాలన డిమాండ్ చేస్తూ.. 2 లక్షల ఉద్యోగాల సాధనకై మంగళవారం చలో గాంధీభవన్ కార్యక్రమానికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. దీంతో గాంధీభవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఉదయం నుంచే భారీగా పోలీసులు మోహరించారు. అయినప్పటికీ గాంధీ భవన్‌కి పలువురు నిరుద్యోగులు తరలివచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి పలు స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. నోటిఫికేషన్లు విడుదల చేయాలని గాంధీభవన్‌కు ముట్టడికి రాలేదని, వినతి పత్రం అందజేయడానికి వచ్చామని నిరుద్యోగులు పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. 20 వేల మెగా డీఎస్సీ, బీపీఓలో ఖాళీగా ఉన్న 6 వేల ఉద్యోగాలు, ఆర్ధికశాఖ అనుమతితో క్లియర్‌గా ఉన్న పవర్ సెక్టార్లో ఖాళీగా ఉన్న 5368 ఉద్యోగాలు, 20 వేల పోలీసు శాఖ ఖాళీలు, పాత నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా గ్రూప్ 1,2,3 ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ హామీలే తాము అడుగుతున్నట్లు ప్రభుత్వంపై మండిపడ్డారు.