నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో(Nizamabad) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి(Youths died) చెందిన ఘటన ఆదివారం మోపాల్ మండలం మంచిప్పలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్కు చెందిన కొందరు మంచిప్పలోని దర్గాకు వచ్చారు. దర్శనం అనంతరం వీరిలో ఇద్దరు యువకులు సరదగా స్థానిక పెద్ద చెరువులో దిగి నీట మునిగారు. స్థానికులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
స్థానికులు చెరువులో గాలించగా సయ్యద్ మూస అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. అనంతరం రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా మరో యువకుడు సయ్యద్ వాసిక్ మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ యాదగిరి గౌడ్ మృతదేహాలను పంచనామా చేసి ప్రభుత్వ హాస్పిటల్కు పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. దైవదర్శనానకి వచ్చిన యువకులు అనంతలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.