హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో రెండు వేల మంది గులాబీ కండువా కప్పుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో నియోజకవర్గానికి చెందిన దళిత యువ నాయకులు 2,000 మంది మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీ, ఈటల గురించి తెలిసే పెద్ద సంఖ్యలో యువకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
ఈ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క అంబేద్కర్ భవనాన్ని కూడా ఈటల కట్టించలేదని చెప్పారు. దళితుల ఉన్నతికి సీఎం కేసీఆర్ గొప్ప పథకాన్ని తీసుకొచ్చారని, బీజేపీ పాలిత రాష్ట్రాలలో దళితులపై దాడులు నిత్యం జరుగుతుంటాయని కొప్పుల తెలిపారు. దళితబంధు లాంటి మహత్తర పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేవని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
టీఆర్ఎస్లో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘మీరు ఈరోజు నిజాన్ని గ్రహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల పేదరికాన్ని పారదోలేందుకు ధైర్యం చేసి ఈ గొప్ప పథకాన్ని తెచ్చారు. కాళ్ల చెప్పులు అరిగినా లోన్లు వచ్చేవి కావు. ఇప్పుడు దరఖాస్తులు పెట్టేది లేదు, ఆఫీసుల చుట్టూ తిరిగేది లేదు, పైరవీలు లేవు, వాయిదాలు కట్టేది, తిరిగి చెల్లించేది లేదు. మీకు పడుతున్న డబ్బుల్ని సద్వినియోగం చేసుకోండి. మీ కాళ్ల మీద మీరు నిలబడాలి. నలుగురిని బతికించే విధంగా, ఐదుగురికి ఉద్యోగాలిచ్చే విధంగా గొప్పగా ఎదగాలి. తొందరపడి ఏ నిర్ణయాలు వద్దు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి.’ అని సూచించారు.
‘పాడి, పాల ఉత్పత్తి పనులపై దృష్టి పెట్టండి. కరీంనగర్, వరంగల్, హన్మకొండల్లో కూడా మీరు షాపులు పెట్టుకోవచ్చు. వైన్, మెడికల్ షాపులు కూడా పెట్టుకోవచ్చు. కాంట్రాక్టు పనులు కూడా చేయొచ్చు. కెసిఆర్ ఈ పనుల్లో కూడా రిజర్వేషన్లు తీసుకువస్తుండ్రు. మీరు బాగా పని చేసి 100% విజయం సాధించాలి’ అని ఆశించారు. దేశానికి హూజూరాబాద్ దిక్సూచిగా మారాలని, చీడ పురుగులను ఏరి పారేయాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెసుకు ఇక్కడ డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు.