నమస్తే నెట్వర్క్, మే 21 : రాష్ట్రంలో మండుతున్న ఎండల తీవ్రతకు తాళలేక వడదెబ్బకు గురై గురువారం ఇద్దరు కౌలు రైతులు మృతిచెందారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహడ్కు చెందిన పొన్నాల భరత్ (34) రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరిపంట సాగు చేశాడు. పంటను కోసి వడ్లను ఆరబెట్టాడు. గురువారం తండ్రి చేరాలు, తల్లి ఉదయమ్మతో కలిసి మధ్యాహ్నం వడ్లను బస్తాల్లో ఎత్తుతుండగా భరత్ ఒక్కసారిగా కండ్లుతిరిగి కిందపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజిపేట గ్రామానికి చెందిన కౌలు రైతు కట్ట వెంకన్న(63) మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. గ్రామంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మూడు రోజుల క్రితం ధాన్యం పోశాడు. మూడు రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద కాపలా ఉన్నాడు. రోజువారీగా ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యం కుప్ప పోసి బుధవారం ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో వడదెబ్బ తగిలి మృతిచెందాడు.