హైదరాబాద్, సోన్, ఆర్మూర్‌టౌన్, ఏప్రిల్ 15: బతుకుదెరువు కోసం పొట్టచేతబట్టుకొని దుబాయికి వెళ్లిన తెలంగాణవాసులు హత్యకు గురయ్యారు. ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వెళ్లినవారు పాకిస్థానీయుల దురాగతానికి బలయ్యారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లాలోని సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్‌సాగర్(40), జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన దేగం సాగర్ ఉపాధి నిమిత్తం కొన్నేండ్ల కిందట దుబాయికి వెళ్లారు. స్థానిక బేకరీలో పని చేస్తున్నారు. అయితే, శుక్రవారం విధులు నిర్వర్తిసున్న సమయంలో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు దుండగులు ప్రేమ్‌సాగర్, శ్రీనివాస్‌లపై దాడి చేసి, దారుణంగా హత్య చేశారు. పారిపోయేందుకు ప్రయత్నించిన దేగం సాగర్‌పైనా దాడికి పాల్పడ్డారు. ఆయన తీవ్రంగా గాయపడగా.. పోలీసులు, సహోద్యోగులు సాగర్‌ను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం సాగర్ చికిత్స పొందుతున్నారు. నిందితులు మతపరమైన నినాదాలు చేస్తూ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. కాగా, ప్రేమ్‌సాగర్, శ్రీనివాస్‌ల మృతితో వారి స్వగ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. క్షతగాత్రుడు దేగం సాగర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కేంద్రమంత్రి జైశంకర్‌కు కిషన్‌రెడ్డి లేఖ
శ్రీనివాస్, ప్రేమ్సాగర్ల మృతదేహాలను వెంటనే స్వదేశానికి రప్పించాలని కోరుతూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ఈ అంశంపై జైశంకర్ వెంటనే స్పందించారని ఆయన తెలిపారు. కేంద్రమంత్రి ఆదేశాల మేరకు దుబాయిలోని భారత కాన్సులేట్ అధికారులు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. హత్య కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక సిద్ధం కానందున మృతదేహాలు తరలించడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.