KTR : కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు రాజకీయ నిరుద్యోగ మోసగాళ్లు చందమామ వాగ్ధానాలు చేసి.. తెలంగాణ యువతను కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొలిపారని ఆరోపించారు.
ఆ ఇద్దరు రాజకీయ నిరుద్యోగ మోసగాళ్ల మాటలు నమ్మి ఇప్పుడు వాళ్లకు మెత్తటి ఉద్యోగాలు వచ్చేలా చేసిన యువతకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్గానీ, ఒక్క ఉద్యోగంగానీ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగర వీధుల్లో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని, అయినా ఆ ఇద్దరు కాంగ్రెస్ మోసగాళ్లు నిరుద్యోగులకు మద్దతుగా బయటికి రావడం లేదని, వాళ్లు ఎక్కడివోయిండ్రని కేటీఆర్ ప్రశ్నించారు.