Nirmal | హైదరాబాద్ : నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ రోడ్డు ప్రమాదాలు శనివారం రాత్రి చోటు చేసుకున్నాయి.
నిర్మల్ పట్టణంలోని డాక్టర్స్ లేన్లో ఓ యువకుడు బైక్పై వెళ్తున్నాడు. అదుపుతప్పి డివైడర్ను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న యువకుడు సాయిచరణ్(22) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. త్వరలోనే విదేశాలకు వెళ్లి ఉన్నత చదువును అభ్యసించేందుకు తమ కుమారుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు రోదించారు. సాయిచరణ్ ఇండియన్ నేవికి సంబంధించిన కోర్సు పూర్తి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ వార్తాపత్రికలో పని చేస్తున్నాడు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం పరిధిలోని లింబుగూడ గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సైదం భీమ్రం(53) తీవ్ర గాయాలపాలై మరణించాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ రెండు ప్రమాద ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.