హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): బడులు ప్రారంభమై నెల దాటుతున్నా విద్యార్థులకు ఉచిత యూనిఫారాలు ఇంకా అందలేదు. దసరా వరకు రెండు జతలు అందే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అత్యవసర సమీక్షలు నిర్వహిస్తున్నది. వేర్వేరు గడువులు పెట్టడంతో అయోమయం నెలకొన్నది. గురువారం యూనిఫారాలపై సమీక్షించిన సీఎం రేవంత్ ఆగ స్టు 15లోపు యూనిఫారాలు అందాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్లతో సమీక్షించిన సీఎస్ సంజయ్ నెలరోజుల్లో అందజేయాలని ఆదేశించారు. నెల రోజులు అంటే ఆగస్టు 24 అవుతుంది. సీఎం ఒకలా.. సీఎస్ ఒక గడువు విధించడం గందరగోళానికి దారితీస్తున్నది.
సర్కార్ బడుల్లోని విద్యార్థులకు రెండు జతల ఉచిత యూనిఫారాలు అందజేస్తున్నారు. కొంత కాలంగా జూన్లో బడులు ప్రారంభయ్యే రోజు ఒక జత అందజేసి, ఆ తర్వాత ఆగస్టు వరకు రెండో జత ఇచ్చిన సందర్భాలున్నాయి. కానిప్పుడు జూలై నెలాఖరు సమీపిస్తున్నా చాలా బడులకు వస్త్రం అందలేదు. 2026-27 విద్యాసంవత్సరానికి 1,13,59,888 మీటర్ల వస్త్రం అవసరముండగా ఇప్పటి వరకు కేవలం 21,01,325 మీటర్ల వస్త్రం మాత్రమే పంపిణీ అయ్యింది. అంటే సరఫరా అయ్యింది 18.5% మాత్రమే. ఈ వస్త్రం కూడా 14 జిల్లాలకే చేరింది. వస్త్రం వచ్చేదెప్పుడు.. యూనిఫారాలు కుట్టేదెప్పుడు అన్నట్టుగా పరిస్థితులున్నాయి. ప్రస్తుతానికి విద్యార్థులు పాత దుస్తులతోనే బడులకు హాజరవుతున్నారు.
స్కూళ్లు, గురుకులాల పాఠశాలల్లోని విద్యార్థులకు నెలరోజుల్లోగా 2 జతల యూనిఫారాలు అందజేయాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం స్కూల్ యూనిఫారాలు, ఎల్ నినోపై సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు. యూనిఫారాలు కుట్టేందుకు 26వేల మంది స్వయం సహాయక బృందాల మహిళలను గుర్తించామని పేర్కొన్నారు. సకాలంలో యూనిఫారాలు కుట్టించాలన్న టార్గెట్ పెట్టుకుని, జిల్లా, మండల స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు.
