బజార్హత్నూర్/కాటారం, మార్చి 29 : దిగుబడులు రాక.. అప్పుల భారం మోయలేక మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా దేగామ గ్రామానికి చెందిన విఠల్ (54) తనకున్న మూడెకరాల్లో పత్తి వేశాడు. బ్యాంకులో, ప్రైవేటుగా కలిపి రూ.5 లక్షల అప్పుచేశాడు. సర్కారు బ్యాంకు రుణం మాఫీ చేస్తుందని ఆశపడ్డాడు. మాఫీకాక దిగులుతో శుక్రవారం పురుగుల మందు తాగాడు. తోటి రైతులు విఠల్‌ను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. విఠల్ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.
భూపాలపల్లి జిల్లా గంగారం గ్రామానికి చెందిన రైతు చల్ల రవీందర్ (43) రెండు ఎకరాల భూమితోపాటు మరో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, వరి సాగు చేశాడు. రూ.10 లక్షల వరకు అప్పు అయ్యింది. మనోవేదనకు గురై ఈ నెల 24న గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు కాటారంలో చికిత్స చేయించిన అనంతరం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి రవీందర్ మృతి చెందాడు.