హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణా) : రాష్ట్రంలో మరో రెండు రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరంతోపాటు సమీప ప్రాంతాలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసినట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం కూడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.