హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రం లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, ములుగు, కామారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, జనగామ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేశారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై జల్లులు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా జూలై సాధారణ వర్షపాతం 229.1 మి.మీ ఉండగా, ఇప్పటి వరకు 238.9 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌లో అత్యధికంగా 10.02 సెం.మీ, ఆదిలాబాద్ అర్బన్‌లో 6.46 సెం.మీ,ఇంద్రవెల్లిలో 4.56 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.