రెండు నెలలుగా యూరియా కోసం అన్నదాత అరిగోస పడుతున్నడు. సమయానికి యూరియా వేయక చేతికొచ్చిన పంట కండ్లముందే వాడిపోతుంటే చూడలేక కన్నీటి పర్యంతమవుతున్నడు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి విత్తనాలు వేయగా మొలకెత్తిన పంటను చూసి సంబురపడిన అన్నదాత ఏపుగా పెరిగి ఎరువులు అందక వాడిపోయిన పంటను చూసి ఆందోళన చెందాడు. బీఆర్ఎస్ హయాంలో సమయానికి విత్తనాలు, ఎరువులు, సాగునీరు అందగా రాజులాగా బతికిన రైతన్న కాంగ్రెస్ పాలనలో ఎరువులు దొరక్క దిగాలుపడుతున్నాడు. మళ్లీ కేసీఆర్ సార్ వస్తేనే తమ కష్టాలు గట్టెక్కుతాయని అభిలషిస్తున్నాడు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్
కౌలుకు తీసుకున్న భూమిలో మక్కజొన్న సాగుచేసిన. నెల నుంచి యూరియా కోసం తిరిగితే ఒక్కబస్తా కూడా దొరకలే. దీంతో పెరుగుదల ఆగిపోయింది. కలుపు పెరిగింది. నిలిచిపోయిన పంటను చూసి కండ్లకు నీళ్లు పెట్టుకున్న. దిక్కు తోచక పశువులను చేలో కట్టేసి మేపుతున్న. వరిని కాపాడుకుందామని బుధవారం రాత్రి వచ్చి దుకాణం ముందు పడుకొని మధ్యాహ్నం దాకా వేచి ఉన్నా ఒక్కబస్తా దొరకలే. ఇట్లా అయితే ఎవుసం ఎలా చేస్తాం.
-శివరాత్రి శ్రీకాంత్, రైతు, మీర్జాపూర్, సిద్దిపేట జిల్లా
నర్సంపేట(ఖానాపురం), సెప్టెంబర్11 : మాది వరంగల్ జిల్లా ఖానాపురం మండలం గొల్లగూడెం తండా. ఈ ఏడాది 5ఎకరాలలో మక్కజొన్న పంటను సాగు చేశాను. నెల రోజులుగా సొసైటీ గోదాము చుట్టూ తిరిగితే 2 బస్తాల యూరియా మాత్రమే దొరికింది. ఆ యూరియా ఎకరం మక్కజొన్నకే సరిపోయింది. మిగిలిన నాలుగు ఎకరాల పంట అక్కరకు రాకుండా పోయింది. ఏళ్ల తరబడి యూరియా సమస్యలేనిది ఈ ప్రభుత్వంలో యూరియా సమస్య వచ్చింది. యూరియా అందక పంటల పరిస్థితి ఇలా ఉంటే బతకడమే చాలాకష్టంగా మారింది.
– తేజావత్ శ్రీను, గొల్లగూడెంతండా, ఖానాపురం మండలం, వరంగల్ జిల్లా