Telangana | హైదరాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): పటాన్చెరు మండలం సుల్తాన్‌పూర్‌లో దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై ఇద్దరు మంత్రులు, పార్టీ ఫిరాయించిన ఒక ఎమ్మెల్యే కన్నుపడింది. ఒక్కొక్కటి రూ.పది కోట్ల విలువ చేసే వంద ఎకరాలను హస్తగతం చేసుకునేందుకు భారీ స్కెచ్ గీశారు. ఎప్పుడో రద్దయిన ఇనాందారుల వారసులంటూ కొందరిని తెర మీదకు తీసుకొచ్చి, వారి చేత దరఖాస్తులు ఇప్పించి, వాటిని కాజేసేందుకు మాస్టర్‌ప్లాన్ వేశారు. ఇప్పటికే ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసి, చదునుచేస్తూ, వెంచర్లు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ భూబాగోతంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి అమీన్పూర్ తహసీల్దార్‌ను వివరణ కోరడంతో ఆ ఫెన్సింగ్‌ను కూల్చివేయాలంటూ కిందిస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం సుల్తాన్పూర్ 1348 ఫస్లీ సంవత్సరానికి సంబంధించిన తొలి పహణీలో పన్మక్తా ఫరీదుద్దీన్ పేరు మీద ఇనాం భూములున్నాయి. సర్వే నంబర్ 30లో మొత్తం 722.2 ఎకరాలు భూమి ఉన్నది. ఇందులో 90 ఎకరాలు బొమ్మన్‌కుంట చెరువు శిఖం కింద ఉన్నది. మరో 242.07 ఎకరాలు సాగు భూమి, మిగిలినదంతా కొండలు, గుట్టలతో కూడిన భూమి. ఆయన మరణానంతరం ఇనాం రద్దయ్యింది. అప్పటినుంచి రెవెన్యూ రికార్డుల్లో అవి ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయి. కానీ, 1986 జూన్‌లో అప్పటి సంగారెడ్డి ఆర్డీవో ఇనాందారుల వారసులను సృష్టించి, వారికి 432.25 ఎకరాల మీద యాజమాన్య హక్కులు ఇస్తూ.. సర్టిఫికెట్ (ఓఆర్సీ) జారీచేశారు. ఓఆర్సీ పొందిన ఇనాందార్లు అదే ఏడాది భూ మాఫియా స్మగ్లర్ వాలా నారాయణరావుకు విక్రయించారు.
ఇతని భూ ఆక్రమాల మీద 1983లోనే హౌజ్‌కమిటీ వేశారు. ఈ నేపథ్యంలో ఇనాందారుకు లేని వారసులను సృష్టించి ప్రభుత్వం భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారని 1993లో అప్పటి ఇందుర్తి ఎమ్మెల్యే దేశిని చిన మల్లయ్య అసెంబ్లీలో లేవనెత్తారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం అప్పటి సీసీఎల్ఏ కమిషనర్ ఎస్ఎన్ మహంతిని విచారణ అధికారిగా నియమించింది. సంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి ఓఆర్సీ జారీలో అక్రమాలకు పాల్పడ్డారని ధ్రువీకరిస్తూ 1994 ఏప్రిల్‌లో నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వ సిఫారసు మేరకు 1994 జూన్ 14న, అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇనాందారుల వారసుల పేరుతో జారీచేసిన ఓఆర్సీలను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అప్పటినుంచి ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నది. మరో 242 ఎకరాలు రైతుల పేరు ఉన్నప్పటికీ, అది సాగుకు అనువైన భూమి కాకపోవడంతో రైతులు ఎవరూ సాగు చేయడం లేదు.
ప్రస్తుతానికి 432 ఎకరాల భూమి ఖాళీగానే ఉన్నది. తాజాగా కాంగ్రెస్ మంత్రులు ఇదే భూమి మీద కన్నేశారు. యాజమాన్య హక్కులకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్న కొంతమంది ఇనాందారుల వారసులను పోగేసి వారిని రంగంలోకి దింపారు. ఓఆర్సీ మీద పట్టాలు ఇవ్వాలని స్థానిక రెవిన్యూ అధికారులకు దరఖాస్తులు చేయించారు. దరఖాస్తులు రెవిన్యూ కార్యాలయానికి వెళ్లాయో..లేదో.. వెంటనే మంత్రుల కనుసన్నల్లో నడిచే ఆర్సీపురం మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి రంగంలోకి దిగారు. మొదటి విడతగా 100 ఎకరాల భూమిని స్వాధీనంలోకి తీసుకొని దాని చుట్టూ రేకులతో ఫెన్సింగ్ వేశారు.
విద్యుత్తు శాఖ అధికారులు ఆగమేఘాల మీద కరెంటు స్తంభాలు వేసి ఎల్టీ లైన్ వేశారు. మూడు బుల్డోజర్లు పెట్టి రాత్రింబవళ్లు గుట్టలను చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు కండ్లు మూసుకున్నారు. డిటోనేటర్లు పెట్టి రాత్రికి రాత్రి గుట్టలను పేల్చి వేస్తున్నా పోలీసులు చెవులు మూసుకున్నారు. పెద్ద పెద్ద గుట్టలను పూర్తిగా తొలిచేసి చదును చేశారు. మట్టి రోడ్లు పోశారు. గదులు నిర్మించారు. నల్లా కనెక్షన్లు తీసుకుంటున్నారు. వీటిలో ఏ ఒక్క పనికీ అనుమతి లేదు. అయినా ఇప్పటివరకూ ఏ ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. పైగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పనిపూర్తిచేసేందుకు గతంలో ఇక్కడ పని చేసి బదిలీపై వెళ్లిపోయిన ఒక రెవిన్యూ అధికారిని మళ్లీ ప్రత్యేకంగా తీసుకొచ్చినట్టు తెలుస్తున్నది. ఆయనే అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. గత రెండు నెలలుగా చదును చేసే పని నిరాటంకంగా కొనసాగుతున్నది.
కాగా స్థానిక డిప్యూటీ తహసీల్దార్ కబ్జాదారులను అడ్డకునే ప్రయత్నం చేశారు. ఫెన్సింగ్ వేసి ప్రభుత్వభూమిని కబ్జా చేయడం నేరమని, భూమిని చదును చేసే పనులు ఆపాలంటూ కబ్జాదారులకు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. నోటీసులు జారీ చేసిన 24 గంటల్లోనే సదరు డిప్యూటీ తహసీల్దార్‌ను అక్కడినుంచి బదిలీ చేసినట్టు తెలిసింది. మరో పది, పదిహేను రోజుల్లో పూర్తిగా అభివృద్ధి చేసి ప్లాట్లుగా మార్చేసి విక్రయానికి రంగం సిద్ధంచేశారు. బహిరంగ మార్కెట్లో ముతక భూమి ఎకరాకు రూ.10 కోట్ల చొప్పున పలుకుతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఈ లెక్కన 100 ఎకరాల భూమి విలువే రూ.1,000 కోట్లు అని, ప్లాట్ల రూపంలో విక్రయిస్తే ఆ ప్రాజెక్టు విలువ రూ.3,000 కోట్ల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఒక ఎమ్మెల్యే ఎప్పటినుంచో ఈ భూముల మీద కన్నేసినట్టు ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వీటి స్వాధీనానికి విఫల ప్రయత్నం చేశారు కానీ, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి జిల్లా మంత్రి హరీశ్‌రావు అంగీకరించలేదు. అప్పట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మిన్నకుండిన ఆ ఎమ్మెల్యే.. ఇటీవల పార్టీ మారగానే పాచిక విరిసినట్టు తెలిసింది. రాష్ట్రంలో కీలక మంత్రిగా ఉన్న నేతను కలిసి భూమి వివరాలు గుట్టు చెప్పినట్టు తెలిసింది. అదే ఉమ్మడి జిల్లాలో మరో ఇద్దరు ప్రధాన కాంగ్రెస్ నేతలు ఉండటంతో వారికి కూడా వాటా ఇస్తే ఇబ్బంది ఉండదని సలహా ఇచ్చినట్టు సమాచారం.
ఇద్దరు మంత్రులు, మరో ప్రధాన నేతతో మధ్య వర్తిత్వం చేసి డీల్ ఓకే చేసినట్టు తెలిసింది. భూమి యాజమాన్య హక్కు పత్రాలున్న ఇనాందార్ వారసులకు ప్లాట్లు అభివృద్ధి చేసిన తరువాత ప్రతి ఎకరాకు 750 గజాల చొప్పున ప్లాటు ఇచ్చేలా వారితో ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. అది పోగా మిగిలిన భూ మిలో మంత్రాంగం నడిపిన ఎమ్మెల్యేకు 10%, అదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడికి 10%, ఓ మంత్రికి 25% పోను మిగిలిన సింహభాగం వాటా కీలక మంత్రికి దక్కేటట్టు ఒప్పం దం చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ కబ్జాల మీద అమీన్పూర్ తహసీల్దార్ రాధను వివరణ కోరగా.. గుర్తు తెలియని వ్యక్తులు సర్వే నంబర్ 30లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, అక్రమంగా వేసిన ఫెన్సింగ్‌ను కూల్చివేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధులు అక్కడ ఉండగానే అగమేఘాల మీద సర్వే నంబర్ 30లో కట్టిన కట్టడాలను కూల్చివేయాలని తన కింద స్థాయి అధికారులను ఆదేశించారు. ఇప్పటికైనా అక్రమ ఫెన్సింగ్‌ను కూల్చడానికి సిద్ధపడటం మంచి పరిణామమే కానీ, అక్రమంగా కబ్జా పెడుతున్నప్పుడు ఎందుకు ఆపే ప్రయత్నం చేయలేదని ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వారు నీళ్లు నమిలారు.