మహబూబాబాద్ రూరల్/ఊట్కూర్ (కృష్ణ), మార్చి 30 : అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు మహబూబాబాద్, నారాయణపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భజన తండాకు చెందిన గుగులోత్ విజయ్ (48) తనకున్న 30 గుంటలతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి, వరి సాగు చేస్తున్నాడు. గత ఏడాది పెట్టుబడి కోసం అప్పు తీసుకురాగా, వరి, పత్తి దిగుబడి రాక అప్పులు తీరలేదు. ఈసారి రెండెకరాల్లో మిర్చి పంటకు నల్లితెగులు సోకడంతో మందుల కోసం మళ్లీ అప్పు చేశాడు. మొత్తం రూ.8 లక్షల అప్పు మీదపడింది. వాటిని తీర్చే మార్గం కానరాక మనోవేదనకు గురై సోమవారం పొలం వద్దకు వెళ్లిన విజయ్ చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు.
అప్పుల బాధ భరించలేక కౌలు రైతు కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుబ్రమణ్య నాగరాజు (56) ముప్పై ఏండ్ల కిందట కృష్ణ మండలం గుడెబల్లూర్ వద్దకు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. నదీ తీర ప్రాంతంలో పొలాలు కౌలుకు తీసుకుని వరి, బొప్పాయి, మునగ సాగు చేసేవాడు. రెండేండ్లుగా వ్యవసాయం కోసం రూ.లక్షల్లో అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక వ్యవసాయం వదిలి ఏడాదిగా పాల వ్యాపారం చేస్తున్నాడు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి అధికమై గత్యంతరం లేక ప్రైవేట్ పనులు చేసేందుకు భార్యాబిడ్డలను వదిలి హైదరాబాద్కు వెళ్లాడు. ఈ క్రమంలోనే సొంత ఇంటిని సైతం విక్రయించాడు. బంగారం తాకట్టు పెట్టి కొంత వరకు అప్పులు తీర్చాడు. అయినప్పటికీ తీవ్రమైన ఒత్తిడి రావడంతో రెండ్రోజుల కిందట గ్రామానికి వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో సమీపంలోని కృష్ణా బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకాడు. నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు.