దుబ్బాక/గంభీరావుపేట, ఆగస్టు 26 : ఆర్థిక ఇబ్బందులతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా ధర్మాజీపేటకు చెందిన దివిటి కనకరాజు (36) తనకున్న ఎకరన్నరం భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పంట సాగు కోసం రూ. 5 లక్షలకుపైగా అప్పు చేశాడు. తీవ్రంగా నష్టపోయి, అప్పు తీర్చే మార్గంలేక మానసికంగా కుంగిపోయాడు.
ఈనెల 21న ఇంట్లో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న కనకరాజును అతడి భార్య, చుట్టుపక్కల వారి సాయంతో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ కనకరాజు మంగళవారం ఉదయం మృతిచెందాడు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగవరం గ్రామానికి చెందిన సతీశ్(36)కు రెండెకరాల పొలం ఉన్నది. వరి సాగుకు నీటి వసతులు లేకపోవడంతో అప్పు తెచ్చి బోరు వేయగా నీళ్లు రాలేదు.
దీంతో భూమిని బీడు పెట్టి ఫైనాన్స్‌లో హార్వెస్టర్ కొనుగోలు చేశాడు. సరైన ఉపాధి లభించకపోవడం, పంట పండకపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చేమార్గం కానరాక తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ నెల 21న ఉదయం పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.