ముదిగొండ, ఫిబ్రవరి 14: ఖమ్మం జిల్లాలోని (Khammam) ముదిగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం ఉదయం ముదిగొండ సమీపంలో ఖమ్మం-కోదాడ జాతీయరహదారిపై గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం టైర్లు పేలిపోయాయి. దీంతో అదుపుతప్పిన వాహనం బోల్తాపడింది. ఈ క్రమంలో అందులో ఉన్నవారు రోడ్డుపై చల్లాచెదురుగా పడిపోయారు. వారిపై గ్రానైట్ బండలు పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా దవాఖానకు తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కాగా, ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్నవారు ఫొటోలు తీసుకుంటూ ఉండిపోయారని, వెంటనే స్పందించి ఉంటే మృతుల్లో ఒకరు బతికేవారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.