కొండాపూర్, ఏప్రిల్ 12 : రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని భూముల్లో చేపట్టిన అడవుల నరికివేత వన్యప్రాణులకు శాపంగా మారింది. తలదాచుకునే చోటు కనుమరుగవడంతో బయటకి వస్తున్న జింకలు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతున్నాయి. శనివారం బయటికి వచ్చిన రెండు జింకలు కుక్కల గుంపునకు కనిపించడంతో, ఒక్కసారిగా కుక్కలు దాడికి యత్నించాయి.
ప్రాణాలు కాపాడుకునేందుకు వేగంగా పరిగెత్తిన జింకలు చెరువు నీటిలోని పొదల్లో ఇరుక్కుని ఓపిరాడక మృతి చెందాయి. కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయం వన్యప్రాణులకు శాపంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాత్రికి రాత్రే వందల ఎకరాల్లోని అడవులను మాయం చేసిన ప్రభుత్వం.. కనీసం వన్యప్రాణుల సంరక్షణకైనా జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. వరుసగా జింకలు మృత్యువాత పడుతుండటం జంతు ప్రేమికుల హృదయాలను ఎంతగానో కలిచివేస్తున్నది.