Tragedy | చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 14 : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం నెలకొంది. మామయ్య పెళ్లికి వచ్చి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇంటి బయట ఉన్న కారులో ఆడుకుంటుండగా లాక్ పడటంతో ఊపిరాడక అందులోనే ప్రాణాలు విడిచారు.
వివరాల్లోకి వెళ్తే.. చేవెళ్ల మండల పరిధిలోని పామెన గ్రామానికి చెందిన కావలి వెంకటేశ్, జ్యోతి దంపతుల కుమార్తె తన్మయశ్రీ(5), షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన మహేందర్-ఉమారాణి దంపతుల కుమార్తె అభినయశ్రీ(4)ల మామయ్య తెలుగు రాంబాబు వివాహం ఈ నెల 30 న ఉండటంతో దామరగిద్దకు వచ్చారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇద్దరు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఇంటి బయట పార్క్ చేసి ఉన్న తన మామయ్య కారులోకి ఎక్కారు.
ఇద్దరు చిన్నారులు కారులోకి ఎక్కిన విషయాన్ని కుటుంబసభ్యులు ఎవరూ గమనించలేదు. ఈ క్రమంలోనే కారుకు లాక్ వేశారు. మధ్యాహ్నం 2 గంటలు అవుతున్నా చిన్నారులు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. అనుమానం వచ్చి కారులో చూడగా ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లి కనిపించారు. దీంతో కంగారుపడిపోయిన కుటుంబసభ్యులు చిన్నారులను వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు.. చిన్నారులు అప్పటికే మృతిచెందారని నిర్ధారించారు. మామయ్య పెళ్లికి వచ్చి ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.