హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బీజేపీ ఎంపీల్లో ఇద్దరు ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లతో గ్రాడ్యుయేట్లుగా చెలామణి అవుతున్నట్టు విమర్శలు ఉన్నాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది. ‘చూస్తుంటే బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటివాళ్లు చాలామంది ఉన్నట్టున్నారు. తెలంగాణలో ఇద్దరు బీజేపీ ఎంపీలపై ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ల ఆరోపణలు ఉన్నాయి. రాజస్థాన్, తమిళనాడు యూనివర్సిటీల నుంచి వాటిని పొందినట్టు చెప్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లలో ఇలా తప్పుడు వివరాలు ఇవ్వడం నేరం కాదా? ఒకవేళ అది నిజమేనని తేలితే లోక్‌సభ స్పీకర్ వెంటనే వారిని బర్తరఫ్ చేయాలి’ అని మంత్రి కేటీఆర్ మంగళవారం ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్‌తో రాజకీయ వర్గాల్లో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌పై జోరుగా చర్చ మొదలైంది.
ఎంపీ అర్వింద్‌పై గతంలోనే ఆరోపణలు
నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. తాను రాజస్థాన్‌లోని జనార్దన్రాయ్నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్ (డీమ్డ్ యూనివర్సిటీ) నుంచి దూరవిద్యా విధానంలో 2018లో ఎంఏ పొలిటికల్ సైన్స్ పట్టా పొందానని ఎంపీ అర్వింద్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో సదరు యూనివర్సిటీ ఓ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇస్తూ.. 2018లో తమ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి పాస్ అయిన విద్యార్థుల జాబితాలో ధర్మపురి అర్వింద్ అనే పేరు లేదని స్పష్టం చేసింది. దీంతో అర్వింద్ డిగ్రీ ఫేక్ అని విమర్శలు వెల్లువెత్తాయి. వాస్తవాలు వెల్లడించాలని బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు నిలదీసినా అర్వింద్ పెద్దగా స్పందించలేదు. ఆ సమయంలో కొవిడ్ ఉండటంతో తెలివిగా ‘నా డిగ్రీ సర్టిఫికెట్లను తర్వాత చూపిస్తాను. ముందుగా కొవిడ్‌ను సమిష్టిగా ఎదుర్కొందాం’ అని చెప్పి తప్పించుకున్నారు. డీమ్డ్ యూనివర్సిటీలకు దూరవిద్యా విధానంలో చదువులు చెప్పేందుకు అర్హత లేదని 2017లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. 2018లో పాస్ అయినట్టు ఒకవేళ అర్వింద్ దగ్గర సర్టిఫికెట్ ఉన్నా.. దానికి విలువ ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు.
బండి సర్టిఫికెట్‌పైనా అనుమానాలు
ఎంపీ బండి సంజయ్ తన ఎన్నికల అఫిడవిట్లో తమిళనాడులోని మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందినట్టు పేర్కొన్నారు. కానీ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో తెలియజేయలేదు. బండి సంజయ్‌కి సంబంధించిన వికీపీడియా పేజీలో మాత్రం ఎంఏ డిస్కంటిన్యూడ్ అని ఉన్నది. మరోవైపు మధురై కామరాజ్వర్సిటీలో తరుచూ ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ల కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.