హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి రామగుండం, వయా సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి మీదుగా వెళ్లే రాజీవ్ రహదారిని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ కోరారు. రాష్ట్రంలోని 33 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలని కేంద్ర మంత్రికి సోమవారం లేఖ రాశారు. రాజీవ్ రహదారిలో వాహనాల రాకపోకలు పెరిగి రద్దీగా మారడమేకాకుండా, తరచూ ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా అప్‌గ్రేడ్ చేయాలని, దీనిని మహారాష్ట్రలోని చంద్రాపూర్ మీదుగా నాగ్‌పూర్ వరకు పొడగించాలని కోరారు. ఇదే విషయాన్ని కరీంనగర్ ఎంపీగా 12-2-2019 తేదీన పార్లమెంటులో ప్రస్తావించానని వినోద్ గుర్తుచేశారు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 30లో పేర్కొన్న విధంగా తెలంగాణలో జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేయాలని, మారుమూల ప్రాంతాలకు కూడా రహదారి కనెక్టివిటీ పెంచాలని లేఖలో పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాకు జాతీయ రహదారితో కనెక్టివిటీ లేదని, రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా అప్‌గ్రేడ్ చేస్తే ఈ జిల్లాకు ఆ లోటు తీరుతుందని పేర్కొన్నారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి చొరవతీసుకోవాలని, రాష్ర్టానికి సముచిత న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు.