Turmeric Price | నిజామాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి ) : పసుపు రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. పేరుకేమో నిజామాబాద్‌కు పసుపుబోర్డు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ పెద్దలు మద్దతు ధరను కల్పించడంలో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందారు. దీంతో పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా రైతుల పరిస్థితి మారింది. కనీస మద్దతు ధర రూ.15 వేలు దక్కితే కానీ రైతులకు మేలు జరగదు. మార్కెట్ అధికారుల మాయాజాలంతో క్వింటా పసుపు రూ.10 వేలలోపే పలుకుతున్నది. రూ.8వేల నుంచి రూ.10 వేలలోపే ధర పలుకుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
జనవరి 14న నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డును ఓ ప్రైవేటు హోటల్లో ప్రారంభించి.. బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించారు. అయితే మద్దతు ధరరాక గడ్డుకాలాన్ని పసుపు రైతులు అనుభవిస్తుంటే పసుపుబోర్డు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఎకరా విస్తీర్ణంలో పసుపు సాగుకు రూ.1.20 లక్షలకు పైగా ఖర్చవుతున్నది. 9 నెలలపాటు ఎంతో శ్రమించి పండించే పసుపు సాగును కేంద్రం ప్రోత్సహించాలంటే కనీసం క్వింటాకు రూ.15వేలు ప్రకటించాలి. లేదంటే రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిసారించే ప్రమాదముంది. నిజామాబాద్ మార్కెట్‌కు ప్రతిరోజూ 8వేల నుంచి 10 వేల క్వింటాళ్ల వరకు పసుపు వస్తుండగా.. పసుపు చూరాకు గరిష్ఠంగా రూ.10,566, కనిష్టంగా రూ.8వేలు.. గోల (బల్బ్)కు గరిష్ఠంగా రూ.10,727, కనిష్టంగా రూ.8 వేలు.. కాడి (ఫింగర్)కి గరిష్ఠంగా రూ.12,388, కనిష్టంగా రూ.10 వేలలోపే పలుకుతున్నది.
మేం అమ్ముకుని ఊరికి పోయినంక పసుపు ధరలు పెరుగుతాయ్. యాటా ఇదే లొల్లి.. మేము అమ్మినంక ధర పెరుగుడు మతలబు ఏందో సమజైతలేదు. మార్కెట్‌కు తెచ్చినంక వెనక్కి తీసుకుపోలేం. చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి అత్తున్నది.
తొమ్మిది నెలలపాటు సాకిన పంటను మార్కెట్‌కు తీసుకుపోతే గిట్టుబాటు అయితలేదు. వ్యాపారులు, దళారులకే ఫాయిదా అయితున్నది. మా రెక్కల కష్టానికి ఇలువ లేకుండా పోతున్నది. కనీసం రూ.15 వేల ధర అత్తేనే మాకు ఫాయిదా అయితది.
మాది జగిత్యాల జిల్లా. ఏండ్ల సంది పసుపు సాగు చేస్తున్నం. ఎప్పుడూ మా కష్టానికి తగ్గ ఫలితం అస్తలేదు. బయట ప్రతి వస్తువు ధరలు పెరుగుతున్నయ్. కానీ మాకాడికి వచ్చేసరికి ధర పెరుగుతలేదు. పసుపు పంటను కొనేటప్పుడు ధర పెంచడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థమైతలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలె.
9 నెలల పాటు కష్టపడి పండిస్తున్న పసుపు పంటకు ధర దక్కుతలేదు. పసుపు తీసుకుని మార్కెట్లకు అస్తే ఈడ ధరలు చూసి నోటమాట అత్తలేదు. పసుపు సాగుకు పెట్టే ఖర్సుకు.. అచ్చే ధరకు పొంతన లేదు. బిగేడు పసుపు పంట పండియ్యాలంటే లక్షన్నర దాకా ఖర్సయితుంది. ఆ పంట అమ్మితే అంత కూడా అత్తలేదు. గిట్లయితే ఎట్ల బతకాలే. క్వింటాకు రూ.15 వేల ధర అత్తేనే ఏమన్న లాభముంటది.