నిజామాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గిట్టుబాట ధర అందక పసుపు రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మార్కెట్ పాలకవర్గం, అధికారులు అంతా కలిసి ఈ నామ్‌కు పంగనామాలు పెట్టి తమను దగా చేస్తున్నారని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పసుపు కొనుగోలుదారులంతా సిండికేట్‌గా మారి రైతులను నిలువునా ముంచేస్తున్నారు. పసుపు నాణ్యతను పక్కనబెట్టి రైతులను ముంచడమే ప్రధాన ఎజెండాగా ధరలను నిర్ణయిస్తున్నారు. క్వింటాల్ పసుపు ధర రూ.15 వేలు ఇవ్వాలని రైతులు కోరుతుంటే.. అందులో సగం కూడా చేతికి రావడం లేదు. మార్కెట్‌యార్డులో కొమ్ముకు రూ.9,500, మండకు రూ.8 వేలుగా కటాఫ్ ధరగా నిర్ణయించారు. పసుపు కొనుగోలుదారులు అంత కంటే ఎక్కువ ధరకే బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. కానీ మార్కెట్లో ఇందుకు విరుద్ధంగా కొనసాగుతున్నది. వ్యాపారులు కమీషన్ ఏజెంట్లతో కుమ్మక్కై రైతును బలి పశువును చేస్తున్నారు. బహిరంగంగానే ఇంత దారుణాలు జరుగుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు స్పందించడమే లేదు. ప్రజా ప్రతినిధులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. 9 నెలలు కష్టపడి పండించిన పంటకు సరైన ధర లేకపోవడంతో ఏం చేయాలో తోచక పసుపు రైతులు మనోవేదనకు గురవుతున్నారు. దళారుల మాయాజాలంతో రోజుల తరబడి వ్యవసాయ మార్కెట్లో పడిగాపులు కాయలేక అడిగిన ధరకే అప్పజెప్పి నష్టాలతో ఇంటి ముఖం పడుతున్నారు.
నిజామాబాద్ మార్కెట్‌కు వచ్చే పసుపు మొత్తాన్ని కొనుగోలు చేయకుండా కొద్ది మొత్తాన్నే కొనుగోలు చేస్తున్నారు. ఒక కమీషన్ ఏజెంట్ దుకాణానికి 20 మంది రైతులు పసుపు తీసుకొస్తే, అందులో ఒకరిద్దరి పసుపు ఉత్పత్తులకే ధర (మార్కెట్లో కటాఫ్ విధించిన రేట్) కోట్ చేస్తున్నారు. మిగతా వారి పసుపునకు ధర కోట్ చేయడం లేదు. వ్యాపారులు ధర పెట్టక పోవడంతో ఆందోళనకు గురవుతున్న రైతులు.. కమీషన్ ఏజెంట్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. ధర కోట్ చేయలేదని తెలుసుకుని మరుసటిరోజు మార్కెట్‌కు వస్తున్నారు. ఇలా నాలుగైదు రోజులు మార్కెట్‌కు తిరిగి తిరిగి రైతులు వేసారిపోతున్నారు. పసుపు ఉత్పత్తులను కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడం, రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్న రైతులు కమీషన్ ఏజెంట్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో నిర్ణయించిన కటాఫ్ ధర కంటే రూ.1500-2,000 మేర తక్కువ ధరకు కొనేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని కమీషన్ ఏజెంట్లు చెప్తున్నారు. విసిగిపోయిన రైతులు తక్కువ ధరకే అమ్ముకుని కన్నీళ్లతో ఇంటిముఖం పడుతున్నారు. ఇలా కొత్తరకం ఎత్తుగడతో ఈ-నామ్‌కు ఎగనామం పెట్టి ఆఫ్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తూ వ్యాపారులు భారీగా దండుకుంటున్నారు.
పసుపుబోర్డు పేరిట బీజేపీ తెగ హంగామా చేసింది. బోర్డు వచ్చిందంటూ ఆ పార్టీ నేతలు సంబురాలు జరిపారు. కానీ, రైతులు నష్టపోతుంటే ఆ పార్టీ ఎంపీ అర్వింద్ సహా నేతలేవరూ స్పందించడం లేదు. గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతుంటే పసుపు బోర్డు చైర్మన్, కార్యదర్శి కనీసం పట్టించుకోవడం లేదన్న ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పసుపు బోర్డు ఘనత తనదేనంటూ ప్రగల్భాలు పలికిన ఎంపీ అర్వింద్ ఇంతవరకూ పసుపు రైతుల ఆవేదనపై నోరు మెదపడమే లేదు.
రెండ్రోజుల సంది మార్కెట్లో పడిగాపులు కాస్తున్నా. పట్టించుకునేటోడే లేడు. ఖరీదు చేసేందుకు అస్తలేరు. రోడ్డు మీదికి అచ్చి కూసుంటెనే మాట్లాడుతుండ్రు. ధర లేక మస్తు ఇబ్బంది అయితున్నది. పసుపు పంట పండించాల్నా వద్దా అని ఆలోచన జేయాల్సి అస్తున్నది.
వ్యాపారులంతా సిండికేట్ అయ్యిండ్రు. పసుపు క్వింటాల్‌కు రూ.15 వేల ధర పెడ్తరనుకున్నం. తక్కువల తక్కువ రూ.11 వేలు అయినా రాకపోదా అనుకున్నం. మార్కెట్‌కు అత్తే ఏం పాడైంది. గా సేట్లు అచ్చి ఆరు వేలు, ఏడు వేలు అని చెప్తుండ్రు. పూటకొకళ్లు అచ్చి బేరమాడుతుండ్రు. రైతు కష్టంల ఉంటే ఈడ పట్టించుకునేటోళ్లే లేరు.
పసుపు పంటకు పండియ్యాల్నంటే మస్తు ఖర్సయితది. దున్నుడు, మందులు, కూలీలకు లచ్చన్నర దాకా పోతది. అంత ఖర్సు వెట్టి పండించిన పసుపును మార్కెట్లకు తెత్తే ధరే అత్తలేదు. ఈ రేట్లతో అచ్చే డబ్బులు ఖర్సుకూ సరిపోతలేవు. గింత గోస ముందెన్నడూ సూడలే. కండ్లకు నీళ్లొత్తున్నయ్.