అయిజ, జూన్ 19: తుంగభద్ర నదీపరీవాహక రాష్ర్టాలకు సాగునీటి కేటాయింపులకు తుంగభద్ర బోర్డు(టీబీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆయకట్టుకు 5.374 టీఎంసీలు కేటాయించేందుకు ఓకే చెప్పింది. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వచ్చే వరదను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నది. 2023-24 ఏడాదిలో 175 టీఎంసీలు వస్తాయని బోర్డు అధికారులు, ఇంజినీర్లు అంచనా వేశారు. కృష్ణా వాటర్ డిస్పూట్స్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ) కేటాయింపుల మేరకు తెలంగాణ, కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు దామాషా పద్ధతిలో పంపకాలు చేపట్టారు.
ఈ నెల 8న కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం అతిథి గృహంలో టీబీ బోర్డు ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, తెలంగాణ, ఏపీలకు చెందిన ఎస్ఈలు, ఈఈలతో సమావేశం నిర్వహించారు. రెండ్రోజుల కిందట కేటాయింపులపై నిర్ణయం ప్రకటించారు. తుంగభద్ర నదీపరీవాహక రా ష్ర్టాలకు కేడబ్ల్యూడీటీ 212 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అంగీకారం తెలిపింది. కర్ణాటక 138.990, ఏపీ 66.500, ఆర్డీఎస్ 6.510 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అవకాశం ఉందని ఆర్డీఎస్ ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.